ఈ రోజు సికింద్రాబాద్‌లో నూతనంగా నిర్మించిన దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. కొత్త ఆఫీస్ ప్రారంభాన్నితన చేతుల మీదుగా జరిపించినందుకు రైల్వే కార్మికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేటీఆర్ అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అని పేర్కొన్నారు. రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసే ఉన్నాం. ఉద్యమ సమయంలోనూ స్నేహభావంతో మెలిగామని గుర్తు చేశారు. రైల్వే కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. రాష్ర్టం ఏర్పడిన తర్వాత కాజీపేటలో రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకోసం కేంద్రం 135 ఎకరాల భూమిని అడిగితే.. ప్రభుత్వం 300 ఎకరాల భూమిని వారి చేతిలో పెట్టింది.. కానీ ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. హైస్పీడ్ రైళ్లతో అభివృద్ధి వేగవంతం అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు మన రాష్ట్రానికి రాలేదు. రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతుందన్నారు మంత్రి కేటీఆర్. కానీ తెలంగాణ ప్రభుత్వం రైల్వే ఉన్నతిని కాంక్షిస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇండియన్ రైల్వే విశేషమైన సేవలందించింది. దేశం కోసం, ప్రజల క్షేమం కోసం రైల్వే కార్మికులు పని చేస్తున్నారు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.