అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చర్యలను ఖండించారు జో బైడెన్. ట్రంప్ మద్దతుదారుల ఆందోళన హింసాత్మకంగా మారగా దీనిని తప్పుబట్టారు బైడెన్. ట్రంప్ మద్దతుదారులు చేపట్టింది నిరసన కాదు.. తిరుగుబాటేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్యాపిటల్ భవనం వద్ద జరిగిన దాడి ఘటన ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఆధునిక కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరుగలేదన్నారు. ప్రజాప్రతినిధులను క్యాపిటల్ హిల్ పోలీసులు కాపాడటాన్ని మనం చూశామని, చట్టంపై జరిగిన దాడిని ఎన్నడూ చూడలేదన్నారు.
ఆందోళన సందర్భంగా కనిపించిన దృశ్యాలు నిజమైన అమెరికాను ప్రతిబింభించవని, కొద్ది మంది ఉగ్రవాదులు చట్టాన్ని ఉల్లంఘించారని.. ఇది దేశద్రోహమన్నారు. ఇవి తప్పకుండా ఆగిపోవాలని, ఆందోళనకారులంతా వెనక్కి వెళ్లిపోయి ప్రజాస్వామ్యం ముందుకు సాగేలా చూడాలన్నారు. ఆందోళనకారులంతా వెనక్కి వెళ్లి ప్రజాస్వామ్యం ముందుకు సాగేలా చూడాలని అధ్యక్షుడు ట్రంప్‌ను డిమాండ్ చేశారు.
అమెరికా క్యాపిటల్ భవనం వద్ద నూతన అధ్యక్షుడి ఎన్నికను ధ్రువీకరించేందుకు బుధవారం యూఎస్ కాంగ్రెస్ సమావేశం కాగా.. ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నిరసనకారులు సమావేశ భవనంలోకి చొరబడి ఫర్నీచర్, కుర్చీలతో పాటు భవనం అద్దాలను ధ్వంసం చేశారు.