సావిత్రి బాయి ఫూలే జయంతి సందర్భంగా కాకతీయ విశ్వ విద్యాలయం దూర విద్య కేంద్రంలోని ఆమె విగ్రహం వద్ద రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గుండా ప్రకాశ్ రావు, పలువురు ప్రొఫెసర్లు, ఇతర నేతలతో కలిసి విగ్రహానికి పూల మాల వేశారు మంత్రి.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సావిత్రి బాయి పూలే ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే సతీమణి. బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితమంతా పని చేసిన జ్యోతీరావ్ ఫూలే తరహాలోనే మహిళల కోసం తన జీవితమంతా సావిత్రి బాయి పని చేశారు. సావిత్రి బాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లా నయాగావ్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జనవరి 3,1831 న పుట్టారు. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో, అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు.
సావిత్రి బాయి టీచర్, రచయిత్రి, గొప్ప సంఘ సంస్కర్త. విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని ఆమె నమ్మారు. తన భర్త ఫూలేతో కలసి 1848 జనవరి 1న అంటే మనకు స్వాతంత్ర్యం రావడానికి వందేళ్ళ ముందే.. పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, అంటరాని తనానికి వ్యతిరేకంగా, మహిళల సకల హక్కుల కోసం ఆ భార్యా భర్తలు పోరాడారు. ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్య మాత్రమే కాదు, ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం ఉద్యమ మహిళ ఆమె.
కులమత బేధాలు లేకుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆనాడే భావించారు.వితంతువుల పట్ల సమాజంలో వున్న వ్యతిరేకతను గుర్తించి వారి ఆత్మభిమానానికి కై కృషి చేసిన వ్యక్తి. చదువు ద్వారానే సమాజంలో స్త్రీల పట్ల గౌరవం పెరుగుతుంది. ఈ విషయాన్ని ఏనాడో వారు గుర్తించి మహిళల విద్యా వ్యాప్తి చేశారు. సత్య శోధక సమాజం స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనం లేకుండా చేశారు. వితంతువులకు తిరిగి పెళ్ళి చేయడానికి ఉద్యమం చేశారు. తన భర్తి మహాత్మా ఫూలే చనిపోతే, ఆయన చితికి ఆమె నిప్పంటించారు. ఆవిధంగా భర్త చికితి నిప్పంటించిన తొలి మహిళ కూడా సావిత్రి నిలిచారు.
1896-97లో పూణేలో ప్లేగు వ్యాధి సోకిన వాళ్ళందరికీ ముందుండి సేవ చేశారు. చివరికి ఆ వ్యాధి తోనే మార్చి 10, 1897న సావిత్రి బాయి మరణించారు. వీరి జయంతిని జాతీయ మహిళ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రా బాయి పేరు పెట్టారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు.