ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రహదారి భద్రతపై బిఆర్ కెఆర్ భవన్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికకు అవసరమైన ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రోడ్డుప్రమాదాలలో మరణాల సంఖ్యను తగ్గించటం, గోల్డెన్ అవర్ లోపల వైద్యసేవలు అందించడానికి అంబులెన్స్ సేవలు, ఆసుపత్రులు, ట్రామా కేర్ సెంటర్ల ద్వారా అత్యవసర వైద్యసేవలు అందించే నిమిత్తం రూపొందించిన యూనిఫైడ్ యాక్షన్ ప్లాన్‌ను సి.యస్ సమీక్షించారు. ట్రామా కేర్ సెంటర్లలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు నిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ద్వారా శిక్షణను అందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రమాదాల సందర్భంగా క్షతగాత్రుల మరణాల సంఖ్యను తగ్గించే నిమిత్తం ఈఎంఆర్‌ఐ ద్వారా అందించే ఆక్టీవ్ బ్లీడింగ్ కంట్రోల్‌పై మాస్టర్ శిక్షణ కోసం వైద్య శాఖ సిబ్బందిని గుర్తించాలన్నారు.
ఓఆర్ఆర్‌లో ప్రమాదాల తగ్గింపుకు సంబంధించి ఫెన్సింగ్, క్రాసింగ్స్, సైనేజేస్, విద్యుధ్దీకరణ, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ఏఎన్‌పీఆర్ కెమెరాల ద్వారా వేగ నియంత్రణ, పర్యవేక్షణ తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి ఒక టీంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ప్రభుత్వ డ్రైవర్లకు సేఫ్ డ్రైవింగ్, వాహనాల మేంటనెన్స్ లపై ఒక రోజు శిక్షణ అందించటానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి ఆదేశించారు.
ఈ సమావేశంలో రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, అడిషనల్ డిజి (ఎల్ అండ్ ఓ) జితేందర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, సందీప్ శాండిల్య, రవాణా శాఖ కమీషనర్ యం.ఆర్.యం. రావు, Ms.బి.విజేంద్రా, ప్రత్యేక కార్యదర్శి టీఆర్ అండ్ బి, శ్రీ సంతోష్ పిడి, ఓఆర్ఆర్ మరియు తదితర అధికారులు పాల్గొన్నారు.