కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తన వ్యాఖ్యలు వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 4 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించామని తాను చెప్పానని మంత్రి స్పష్టం చేశారు. అయితే రాష్ర్టం మొత్తం కేవలం నాలుగు వేల ఇండ్లు మాత్రమే నిర్మిస్తున్నామని తాను చెప్పినట్లు.. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తన వ్యాఖ్యలు వక్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో గురువారం శ్రీనివాస్‌గౌడ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో నాలుగు వేల ఇండ్లు కట్టామని, అందుకు 10 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు. లాటరీ పద్ధతిలో అర్హులైన వారికి ఇండ్లను అందజేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌ను గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ది చేస్తున్నామని స్పష్టం చేశారు.
గత పాలకులెవరూ మహబూబ్‌నగర్ అభివృద్ధిని పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే పాలమూరు అభివృద్ధి చెందిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి విషయంలో అందరి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి పట్టని కొందరు నాయకులు.. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్లు విజ్ఞతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.