శ్రీశైలంలో శరవేగంగా పునరుద్దరణ పనులు..

157
1
- Advertisement -

ఇటీవల అగ్నిప్రమాదంలో దెబ్బతిన్న శ్రీశైలం జల విద్యుత్ పునరుద్ధరణ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నట్లు జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. వచ్చే వర్షా కాలం పంట సీజన్ నాటికి మొత్తం 6 యూనిట్ల ద్వారా రివర్సబుల్ పంపింగ్ పద్దతుల్లో 900 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో పని చేస్తున్నట్లు వెల్లడించారు. మరే ఇతర సంస్థల సహకారం తీసుకోకుండానే పూర్తిగా తెలంగాణ జెన్ కో అధికారుల సాంకేతిక పరిజ్ఞాణం, అనుభవం, పని తీరుతోనే పునరుద్ధరణ పనులు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీని వల్ల జెన్ కోకు వందల కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా పనుల్లో వేగం సాధ్యమైందని ప్రభాకర్ రావు ప్రకటించారు.

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం పునరుద్ధరణ పనులను ప్రభాకర్ రావు మంగళ, బుధ వారాల్లో పరిశీలించారు. జరుగుతున్న పనులను చూసి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే వర్షా కాలం వరకు (జూన్, 2021)లోగా చేయాల్సిన పనులకు సంబంధించి కార్యాచరణను ఖరారు చేశారు. డైరెక్టర్లు సచ్చిదానందం, వెంకట రాజమ్, అజయ్, జగత్ రెడ్డి, ఎస్సీ హనుమాన్, జల విద్యుత్ కేంద్రం సిఈ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.‘‘ శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం పునరుద్ధరణ పనులు పూర్తి భద్రతా ప్రమాణాలతో జరుగుతున్నాయి. ఇప్పటికే 2 యూనిట్లను పునరుద్ధరణ 300 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతున్నాం. ఈ నెలాఖరుకు మరో యూనిట్ సిద్ధం అవుతుంది. మార్చి నాటికి ఇంకో 2 యూనిట్లు పని చేస్తాయి. అగ్ని ప్రమాదాల్లో ఎక్కువ దెబ్బ తిన్న నాలుగవ యూనిట్ పునరుద్ధరణ పనులు కూడా జూన్ నాటికి పూర్తవుతాయి. నాలుగవ యూనిట్ జెనరేటర్, ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి అన్ని యూనిట్లను సిద్ధం చేసి రివర్సబుల్ పంపింగ్ పద్ధితన 900 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెటుకున్నాం’’అని సిఎండి ప్రభాకర్ రావు వెల్లడించారు.

అగ్ని ప్రమాదం వల్ల దెబ్బతిన్న భూగర్భ జల విద్యుత్ కేంద్రాన్ని పునరుద్ధరించడాన్ని తెలంగాణ జెన్ కో సవాలుగా స్వీకరించింది. ఇతర ఏ ఎజెన్సీలకు పని అప్పగించకుండా జెన్ కో అధికారుల ద్వారానే ఈ పని నిర్వహిస్తున్నాము. దీని వల్ల చాలా వ్యయం తప్పింది. తెలంగాణ జెన్ కో సాంకేతిక పరిజ్ఞానానికి, సమర్ధతకు పునరుద్ధరణ పనులు గీటురాయిగా నిలుస్తాయి. ప్రమాదం జరిగిన నాటి నుండి నేటి వరకు డైరెక్టర్లు, ఇంజినేర్లు, ఆర్టిజెన్లు, ఇతర ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు అని ప్రభాకర్ రావు చెప్పారు.

- Advertisement -