మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్‌బండ్ దిగువన ఏర్పాటు చేయనున్న మినీ శిల్పారామం పనులపై హైదరాబాద్ లోని పర్యాటక భవన్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్తా, టూరిజం ఎండీ మనోహర్, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టూరిజం ఈడీ శంకర్ రెడ్డి, టూరిజం అధికారులు మహేష్, ఓం ప్రకాష్, శశిధర్, స్పోర్ట్స్ అధికారులు సుజాత, వెంకయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో తొలి శిల్పారామం మహబూబ్‌నగర్‌లోనే ఏర్పాటు చేస్తున్నట్లు మినీ శిల్పారామం రాకతో పాలమూరులో పర్యాటకం కొత్త పుంతలు తొక్కనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో దేశంలోనే అతి పెద్దదైన కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పాలమూరును చూసేందుకు హైదరాబాద్ నుంచి సైతం పర్యాటకులు తరలివచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒకప్పుడు కనీసం మంచి నీళ్లు కూడా దొరకని పాలమూరు నేడు అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు.