ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఆదివారం సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. మిడిలార్డర్‌లో వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య పిడుగుల్లాంటి షాట్లతో కంగారూ బౌలర్లను చితకబాదాడు. 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ పాండ్య మెరుపులతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. పాండ్య కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 భారీ సిక్సులతో 42 పరుగులు చేసిన అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా… డేనియల్ సామ్స్ విసిరిన ఆ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు తీసిన పాండ్య ఆ తర్వాత బంతికి భారీ సిక్స్ తో భారత శిబిరంలో సంతోషం నింపాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని స్టాండ్స్ లోకి పంపి టీమిండియా విజయం ఖాయం చేశాడు.
లక్ష్య ఛేదనలో శిఖర్ ధావన్(52: 36 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు) అర్ధశతకంతో మెరవగా కోహ్లీ(40:24 బంతుల్లో 2ఫోర్లు,2సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేఎల్ రాహుల్(30 22 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్స్) జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఆఖర్లో శ్రేయస్ అయ్యర్(12 నాటౌట్: 5 బంతుల్లో ఫోర్, సిక్సర్).. పాండ్యకు మంచి సహకారం అందించాడు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, డేనియల్ శామ్స్, ఆండ్రూ టై, మిచెల్ స్వెప్సన్ తలో వికెట్ తీశారు. స్వెప్సన్, జంపా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టారు.
అంతకుముందు ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ మాథ్యూ వేడ్(58: 32 బంతుల్లో 10ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకోగా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(46: 38 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) కూడా రాణించడంతో 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్(22: 13 బంతుల్లో 2సిక్సర్లు), హెన్రిక్స్(26:18 బంతుల్లో సిక్స్) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో మార్కస్ స్టాయినీస్(16) స్కోరును 190 దాటించాడు. భారత బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. చాహల్(1/51) విఫలమవగా..శార్దుల్ ఠాకూర్(1/39) ఫర్వాలేదనిపించాడు.