డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందనే అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఏఏ పార్టీ ఎన్ని స్ఠానాలు గెలుస్తాయని అంచనా వేస్తున్నాయి. బల్దియా పీఠం మళ్లీ అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఏబిపి-సి ఓటర్ నిర్వహించిన ఒక సర్వేలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తుందని ప్రకటించింది. 150 డివిజన్లలో టీఆర్ఎస్ 92-94 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, బిజెపి 10-12 సీట్లతో సరిపెట్టుకుందని వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం నాలుగు సీట్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఎంఐఎం పార్టీ 38-42 సీట్లను గెలుచుకోవడం ద్వారా పాత బస్తీలో మళ్లీ తన పట్టును నిలుపుకోనుంది. కాంగ్రెస్ 2-4 సీట్లకు మించి గెలవదని, స్వతంత్రులు 2-3 సీట్లు పొందవచ్చని సర్వేలో వెల్లడైంది.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు సర్వే ద్వారా మరోసారి స్పష్టమైంది. టీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల మాదిరిగానే అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.