దొరసాని తర్వాత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్. కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు ఇంకా తెరచుకోకపోవడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో సినిమా రిలీజ్‌అయింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమాతో మరోసారి ఆనంద్ దేవరకొండ మెప్పించాడా లేదా చూద్దాం…
కథ:
గుంటూరు దగ్గరలోని ఓ పల్లెటూరులో కాకా హోటల్ నడుపుకునే కొండలరావు (గోపరాజు రమణ) కొడుకు రాఘవ (ఆనంద్ దేవరకొండ). హోటల్‌లో బొంబాయి చట్నీ బాగా చేస్తాడు. దీంతో గుంటూరులో పెద్ద హోటల్ పెట్టాలని కలలు కంటాడు రాఘవ. అయితే రాఘవ హోటల్ పెట్టడం ఇష్టంలేని తండ్రి ఆటంకులు సృష్టిస్తాడు. ఇదే క్రమంలో తన మామయ్య కూతురు సంధ్యను ప్రేమిస్తాడు రాఘవ. సీన్ కట్ చేస్తే హోటల్ బిజినెస్‌లో రాఘవ ఎలా సక్సెస్ అయ్యాడు…?తన ప్రేమను ఎలా గెలిచాడు అన్నదే మిడిల్ క్లాస్ మెలోడీస్ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ,మాటలు,ఆనంద్ దేవరకొండ. సినిమా కథ అందరికీ తెలిసిన కథే అయిన చక్కటి కథనంతో సరదాగా ఆహ్లాదకరమైన సన్నివేశాలతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు. రాఘవ పాత్రలో ఆనంద్ దేవరకొండ కరెక్ట్‌గా సరిపోయారు. హీరో తండ్రి పాత్ర అద్భుతం. నిజం చెప్పాలంటే సినిమాకు హీరో ఆ పాత్రే. ఆర్టిస్ట్ గోపరాజు రమణ, కొండలరావు తమ పాత్రలో జీవించేశారు. హీరోయిన్ వర్ష తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులంతా ఎవరి పాత్రకు వారు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ క్లైమాక్స్. సినిమాలో మలుపులు, ట్విస్టులు లాంటివి ఏమీ లేవు. కథ అలా సాఫీగా సాగిపోతుంది.దర్శకుడు క్లైమాక్స్‌పై కాస్త దృష్టి పెట్టి ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. సినిమాకు ప్రధాన బలం మాటలు. జనార్ధన్ పసుమర్తి మాటలు అద్భుతంగా రాశారు. మధ్యతరగతి కుటుంబాల్లో,అందులోనూ పల్లెటూళ్లలో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో అలాంటి మాటలతోనే జనార్ధన్ సన్నివేశాలకు ప్రాణం పోశారు. పాటలు కూడా బాగున్నాయి. సన్నీ కూరపాటి కెమెరాతనం బాగుంది. ఎడిటింగ్ బాగుంది. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలకు వంకపెట్టలేం.
తీర్పు:
టైటిల్‌కు తగ్గట్టే ఇదో మిడిల్ క్లాస్ కుటుంబాల కథ. అందరికీ కనెక్ట్ అయ్యే కథ. కథనం,మాటలు,ఆనంద్ దేవరకొండ నటన సినిమాకు ప్లస్ కాగా క్లైమాక్స్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులకు నచ్చే సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్.
విడుదల తేది:20/11/2020
రేటింగ్:2.75/5
నటులు:ఆనంద్ దేవరకొండ,వర్ష బొల్లమ్మ
నిర్మాత: భవ్య క్రియేషన్స్
దర్శకుడు: వినోద్ అనంతోజు