గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అధికార టీఆర్‌ఎస్ సిద్ధమైంది. పార్టీ ఎమ్మెల్యేలను డివిజన్ల బాట పట్టించింది. జీహెచ్‌ఎంసీకి చెందిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలిచి తీరాలనే లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలను, కొత్తగా చేపట్టే పనులకు శంకుస్థాపనల కార్యక్రమాలను వేగవంతం చేసింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాలు, డివిజన్ల వారీగా మంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది. జిల్లాల నుంచి గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి పార్టీ నేతలను తరలించే ప్రక్రియకూ శ్రీకారం చుట్టింది.
డిసెంబర్ 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ నాలుగున కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు . ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 22 మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 1న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి జీహెచ్‌ఎంసి ఎన్నికలు జరగనున్నాయి. 150 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. బ్యాలెట్ పద్దతిలోనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.