జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొద్దిపాటి మార్పులతో తమిళనాడు ఆర్డినెన్స్ కు కేంద్ర న్యాయశాఖ, పర్యావరణ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. నాలుగు రోజులుగా తమిళులు చేస్తున్న ఆందోళనకు కేంద్రం తలొగ్గింది. ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం పంపింది. రాష్ట్రపతి ఆమోదం లభించగానే ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది.
జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయడంతో మెరీనా బీచ్ లో సంబరాలు మొదలయ్యాయి. ఆర్డినెన్స్ కోసం మెరీనా బీచ్ లో నాలుగు రోజులుగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. శుక్రవారం విద్యార్థి సంఘాల పిలుపు మేరకు తమిళనాడు వ్యాప్తంగా బంద్ పాటించారు. మరోవైపు సీఎం పన్నీరు సెల్వం, అన్నాడీఎంకే ఎంపీలు ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. అయితే ఆర్డినెన్స్ చేతికి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు ప్రకటించారు.