నీట్ పరీక్షల్లో సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్, ఆల్ ఇండియాలో 3వ ర్యాంకు సాధించిన తెలంగాణలోని వరంగల్ కు చెందిన స్నికితారెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో తనను కలిసి న స్నికితా రెడ్డి, ఆమె తండ్రి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సదానందరెడ్డి, తల్లి గైనకాలజిస్టు డాక్టర్ లక్ష్మీతో మంత్రి కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ విద్యారంగంలో తెలంగాణ ఎంతో ముందుందన్నారు.
సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఐఎఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలకు కూడా ఇక్కడ కోచింగ్, శిక్షణ లభిస్తున్నదన్నారు. దేశంలోనే విద్యారంగంలోని అనేక పరీక్షల్లో తెలంగాణ విద్యార్థులు విజయ భేరి మోగిస్తున్నారని తెలిపారు. కాగా, భవిష్యత్తులోనూ స్నికిత ఇదే ఉత్సాహంతో చదవాలని, ఉన్నత స్థానంలో నిలవాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్నికిత, స్నికిత తల్లిదండ్రులు మంత్రికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.