ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భ్రమరాంబాదేవి చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఆదిపరాశక్తులో అమ్మవారి మూడోరూపం చంద్రఘంటాదేవిది అని పురాణాలు చెబుతున్నాయి.
యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి పదిచేతుల్లో కుడివైపు ఐదింటిలో పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలలు, ఎడమవైపు చేతుల్లో త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని దాల్చి భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చింది.
చంద్రఘంటా దేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి కలిగి, సౌమ్యం, వినమ్రత కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కంధాలపై విహరిస్తూ భక్తజన నిరాజనాలు అందుకున్నాడు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామిఅమ్మవార్లకు అర్చకులు వివిధ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం అమ్మవారు కుష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుందని ఆలయ ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.