దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వరద నీటిలో మునిగివున్న పలు ప్రాంతాల్లో పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. సరూర్ నగర్, ఆస్మాన్ గఢ్ చార్మినార్ డివిజన్లలో పర్యటించిన సీఎండీ మాట్లాడుతూ, సింగరేని కాలనీ, గౌతంనగర్, శారద నగర్, కమలా నగర్, కోదండ రామ్ నగర్, పి & టి కాలనీ, బార్కాస్, మైసారం, చాంద్రాయణ గుట్ట, అల్ – జుబైల్ కాలనీ, ఫలక్ నుమా, ఇంద్రా నగర్, జమాల్ నగర్, సలాలా ప్రాంతాలు దాదాపు రెండు నుండి మూడు అడుగుల నీళ్ల ముంపులో ఉన్నాయన్నారు. సరూర్ నగర్ డివిజన్ పరిధిలో అపార్ట్మెంట్ సెల్లార్లు, కొన్ని వీధుల్లో వరదనీరు ఉండటం వలన 13 ట్రాన్స్ ఫార్మర్ లు ఛార్జ్ చేయలేదన్నారు. చార్మినార్ డివిజన్ పరిధిలోని కాలనీల్లో వరద నీరు కారణంగా 28 ట్రాన్స్ ఫార్మర్లలో సరఫరా పునరుద్ధరించలేదు. నగరంలో వివిధ ప్రాంతాల్లోని అపార్ట్మెంట్ సెల్లార్లు, వీధులు వరద ముంపులో ఉండటం వలన 222 ట్రాన్స్ ఫార్మర్లలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదన్నారు.
క్షేత్ర స్థాయి అధికారులు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతనే సరఫరా పునరుద్ధరించాలని ఆదేశించారు. గత మూడు రోజులుగా విద్యుత్ అధికారులు, సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు ఎంతగానో శ్రమించారని తెలిపిన సీఎండీ వారి సేవలను మెచ్చుకున్నారు. ఈ పర్యటనలో సీఎండీ శ్రీ జి రఘుమా రెడ్డితో పాటు, సంస్థ డైరెక్టర్ టి శ్రీనివాస్, సూపెరింటెండింగ్ ఇంజినీర్లు ఖాజా అబ్దుల్ రహమాన్, బి. రవి, డివిజనల్ ఇంజినీర్లు సురేష్, జె శ్రీనివాస్, అన్వర్ పాషా ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.