గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ దాఫెదార్ శోభ, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు హాజరైయ్యారు.
ఈ సంద్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న ఐదు ఏండ్లల్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కచ్చితంగా కాపీ కొడతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి ఆలోచన చేయలేదన్నారు. ఇక రైతులు పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనే ముసుగులో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వ్యవస్థకు నాంది పలుకుతుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యుత్ ముసాయిదా బిల్లు, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ జిల్లా ప్రజా పరిషత్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులు రైతుల పాలిట శాపంగా మారాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి తెలిపారు. ఇక జిల్లాలో ఆరు పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవసరమైతే కొనుగోలు కేంద్రాలు పెంచుతామని తెలిపారు. సోయా కొనుగోలు కేంద్రాలు ఎక్కడ అవసరం ఉన్నా ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో 104 రైతు వేదికలకు 104 వేదికలు పూర్తి చేసి కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.