నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన మంత్రి కేటీఆర్..

106
ktr

హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల్లో మంత్రి కేటీఆర్ రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా వర్ష ప్రభావిత పౌరులకి ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని నల్లకుంట లోని శ్రీరామ్నగర్ బస్తీలో నీట మునిగిన ఇళ్లను మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఇతర జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత అంబర్పేట్ లోని ప్రేమ్ నగర్, పటేల్ నగర్ కాలనీలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఆ తరువాత టోలిచౌకి లోని నదీం కాలనీ లో నీళ్ళు నిండిన ప్రాంతాన్ని పరిశీలించారు.

నల్లకుంట, అంబర్పేట కాలనీల్లో వరద నివారణ కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రజలు మంత్రి కేటీఆర్ ని కోరారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకునేందుకు అవసరమైన నిర్మాణాలు, కాలనీలో వరద రాకుండా వేయాల్సిన పైప్లైన్లు, డ్రైనేజీ నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని జోనల్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నల్లకుంట లో ఉన్న నాలాలను పరిశీలించిన మంత్రి అక్కడ రిటైనింగ్ వాల్ కి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. నీటమునిగిన కాలనీల్లో పర్యటించిన మంత్రి, అక్కడి వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తక్షణ సహాయంగా జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్ లో ఉండాలని సూచించారు.

ఆయా కేంద్రాల్లో వారికి అవసరమైన అన్ని రకాల ఆహారం, దుప్పట్లు, మందుల వంటి ప్రాథమిక సౌకర్యాలు అన్నింటిని సమకూర్చినట్లు తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇళ్ల నుంచి నీళ్లు వెళ్లి పోతున్న నేపథ్యంలో పారిశుద్ధ్య కి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇందుకు సంబంధించి స్థానిక జిహెచ్ఎంసి అధికారులు ఆయా కాలనీల ప్రజలకు అందుబాటులో ఉంటారని, పారిశుద్ధ్యానికి సంబంధించి వారందరూ ప్రజలకి సహకరిస్తారని తెలిపారు. వరద తగ్గిన తర్వాత మురికి నీటి సంబంధిత రోగాలు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు సూచించిన మంత్రి, ఇందుకు సంబంధించి ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ ని చేపట్టాలని ఆదేశించారు. టోలిచౌకి లోని నదీం కాలనీ పరిశీలించిన మంత్రి, అక్కడ ఇప్పటికీ వరద నీరు ఎక్కువగా ఉండడంతో తో ఎన్ డి అర్ యాఫ్, జిహెచ్ఎంసి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇప్పటికీ ఇళ్లలో చిక్కుకుపోయిన వారందరినీ బయటకి తీసుకువస్తున్నట్లు వారందరికీ తగిన ఆహారం, షెల్టర్ వంటి సౌకర్యాలను అందించాలని సూచించారు.