హ్యాపీ బర్త్ డే…అలీ

250
ali
- Advertisement -

బాల నటుడిగా సినీప్రస్థానం ప్రారంభించి టాలీవుడ్‌ అగ్ర హాస్యనటుల్లో ఒకరిగా కెరీర్‌ని మలుచుకున్న అలీ..నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్‌లో అగ్రస్ధాయికి ఎదిగారు. అలీ సినిమాలో కనిపిస్తే ప్రేక్షకుల ముఖంలో నవ్వుల పువ్వులు పూయాల్సిందే. హాస్యనటుడిగా మిమిక్రీ చేసినా..థాయ్‌ మసాజ్‌ చేసినా అది అలీకే సెట్‌ అవుతుంది. తన తండ్రి పేరుతో సేవ చేయాలనే ఉద్దేశంతో అలీ ఓ ట్రస్టునూ ప్రారంభించి మంచి మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ఇవాళ అలీ పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

బాలనటుడిగా భారతీ రాజా దర్శకత్వంలో “సీతాకోక చిలుక” (1981)తో మొదలుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్టు దాదాపు వేయి చిత్రాల్లో నటించాడు. కామేడి పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగి అందరినీ గిలిగింతల నటనతో లక్షలాది అభిమానులని సంపాదించుకున్న ఆలీ నిజంగా మహానటుడే అని చెప్పాలి. అతని ‘చాట’ మార్కు డైలాగులు, నాలుక బయటపెట్టి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్, తనదైన శైలీలో డైలాగులు చెప్పే పద్దతి, ఆ టైమింగ్, నిజంగా అద్భుతం. వేయి సినిమాలు చేయడం మాటలు కాదు. ఈ వేయి సినిమాలకు తను కాల్షీట్స్ సర్దడం నిజంగా ఓ సర్కస్ ఫీట్ లాంటిదే. అలీ హీరోగా పదమూడు చిత్రాలు చేసినా రాజేంద్ర ప్రసాద్‌లా హీరోగా ఎదిగే అవకాశాలు రాలేదు. ఆలీ హీరోగా చేసిన చివరి చిత్రం “ఆలిబాబా ఒకడే దొంగ”.

హీరోలూ, క్యారక్టర్‌ ఆర్టిస్టులూ గ్రామాలను దత్తత తీసుకుంటే, కమెడియన్‌ అలీ మహిళా ఖైదీల కుటుంబాలను దత్తత తీసుకున్నాడు. గాంధీ జయంతి సందర్భంగా చంచల్‌గూడా జైలులో జరిగిన కార్యక్రమాలకి అలీ ముఖ్యఅతిధిగా హాజరయ్యాడు. ఆ సందర్భంగా జైలు అధికారుల కోరిక మేరకు నలుగురు మహిళా ఖైదీల కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఎంతో కాలం నుంచీ అలీ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే!

ఏ సినిమాలోనైనా సరే అలీ తన సొంత శైలిలో డైలాగులు చెప్పడంలో కొత్తదనాన్ని, కొత్త నవ్వుల కోణాన్ని ఆవిష్కరిస్తారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లో అలీ కనిపించకుండా ఉండరు. పూరీ జగన్నాథ్‌ తీసే దాదాపు ప్రతీ సినిమాలో అలీ ఉండాల్సిందే. అలీ ఎక్కడ ఉన్నా ఆపన్నులకు తన సేవా హస్తం అందిస్తుంటారు. ఇలాంటి సేవలు చేస్తూ.. తన కెరీర్‌లో ప్రేక్షకులను మెప్పించే మరిన్ని పాత్రలు చేయాలని కోరుకుంటూ వెండితెర నవ్వుల రారాజుకు greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -