కొత్త రెవిన్యూ చట్టం తెచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. ఆ చట్టానికి సంబంధించిన బిల్లు అసెంబ్లీలో అమోదం పొందిన నాటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ భూములకు రక్షణ, భద్రతనిచ్చిన సిఎం కెసిఆర్ ని, గులాబీ జెండాని రైతులు తమ గుండెల్లో పెట్టకుంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఓ రైతు ఏకంగా గులాబీ జెండాని తన పొలంలోనే పెట్టుకుని మరీ తన పొలం పనులు చేసుకుంటున్నాడు. ఆ జెండాలో కెసిఆర్ చిత్రాన్ని ముద్రించిన ఆ జెండా అందరినీ ఆకర్షిస్తున్నది.
అయితే, వరంగల్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని మరో కార్యక్రమానికి ఆ దారిలో వెళుతున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కూడా ఆ జెండా ఆకర్షించింది. చుట్టూ ఆకు పచ్చని పొలాల్లో గులాబీ జెండా రెపరెపల మధ్య, రైతులు, రైతు కూలీలు పనులు చేసుకుంటుండటం చూసిన మంత్రి ఎర్రబెల్లి వెంటనే తన వాహనాన్ని ఆపించారు. నేరుగా ఆ రైతుల వద్దకు చేరుకున్నారు. వారిని పరిచయం చేసుకున్నారు. గతంలో ఎర్రబెల్లి వర్ధన్నపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఉండటంతో వాళ్ళంతా తనకు బాగా తెలిసిన వారు కావడంతో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ జెండా ఎవరు పెట్టారని ఆరా తీశారు. వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన సట్ల నర్సింహులు తన పొలంలో ఆ జెండాని పెట్టుకున్నారని తెలిసి, అతడిని అభినందించారు.
అక్కడి రైతులు సహా కూలీలందరినీ మంత్రి ఎర్రబెల్లి కూడగట్టారు. ఆజెండాని ఎందుకు పెట్టారని అడిగారు. దీంతో వారు, ఆ జెండాని పెట్టడానికి కొత్త రెవిన్యూ చట్టమే కారణమన్నారు. సిఎం కెసిఆర్ చేపడుతున్న అనేక అభివృద్ధి-సంక్షేమ పథకాలకు తోడు కొత్త రెవిన్యూ చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే గాక, భూములకు భద్రత కూడా కలుగుతుందని అన్నారు. ఆ రైతులను, కూలీలను మంత్రి అభినందించారు. అంతేగాక, నేరుగా తానే ఆ జెండాను చేతబట్టి, రైతులంతా తన వెంట నడుస్తుండగా, ఆ పొలాల్లోనే తానూ నడుస్తూ, జై గులాబీ జెండా, కెసిఆర్ జిందాబాద్ అంటూ నినదించారు. వాళ్ళందరూ ఆలా నినాదాలు చేస్తుంటే…తాను కూడా వారితో కలిసి బయట వరకు నడిచారు. జనంతో మమేకమయ్యే మంత్రి సుపరిచతుడు కావడం, నేరుగా పొలాల్లోంచి బురదలోనే నడుచుకుంటూ తమ దగ్గరకి రావడంతో ఆ రైతులు, రైతు కూలీలు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అంతేకాదు, జనమంతా ముద్దుగా దయన్నా అని పిలుచుకునే నాయకుడు తమ వద్దకు వచ్చి, మాట్లాడి, కలిసిపోవడంతో వాళ్ళంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, గులాబీ జెండా జనం గుండెల నిండా నింపుకున్నారని, సీఎం కెసిఆర్ ని తమ గుండెల్లో నిలుపుకున్నారనడానికి ఈ దృశ్యమే నిదర్శనమన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, అభివృద్ధి-సంక్షేమం ప్రజలకు బాగా చేరువ అయిందన్నారు. ప్రజావసరాలకు తగ్గట్లుగా పథకాలు రూపొందించి అమలు చేస్తున్న సీఎం కెసిఆర్ అంటే ప్రజల్లో మాంచి క్రేజీ ఉందన్నారు. ఆ అభిమానమే ప్రజలను గులాబీ జెండాకు అండగా నిలుపుతున్నదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. గులాబీ జెండాని పొలాల్లో నిలిపిన ఆ రైతుల ఆనందాన్ని చూసిన నేను, ఓ రైతు బిడ్డగా, వాళ్ళతో కలిసిపోయానని, ఎంతో సంతోషంగా వారితో గడిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇక్కడే గాక, ఇలాంటి దృశ్యాలు మన దృష్టికి రాకపోయినప్పటికీ, అనేక చోట్ల ఇంతకు మించిన అభిమానం గులాబీ జెండా మీద, సిఎం కెసిఆర్ మీద వ్యక్తం అవుతూనే ఉందన్నారు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు జన్మధన్యమైందన్న ఆనంద కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కూడా ఉన్నారు.