ట్విట్టర్‌లో మాజీ ఎంపీ కవిత సరికొత్త రికార్డు..

372
Kalvakuntla kavitha
- Advertisement -

కల్వకుంట్ల కవిత…తెలంగాణ జాగృతి ద్వారా ప్రజాక్షేత్రంలోకి అడుగిడి, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన మహిళా నాయకురాలుగా…తెలంగాణ ఉద్యమంలో మహిళా గొంతును ఎలుగెత్తి చాటిన నేతగా.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, తక్కువ సమయంలోనే ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచిన ప్రజాప్రతినిధిగా, సర్వత్రా సుపరిచితురాలు. రాజకీయ, సామాజిక వ్యవహార శైలి పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, తాజాగా ట్విట్టర్ లోనూ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ పొందిన దక్షిణ భారతదేశాన తొలి మహిళా రాజకీయనాయకురాలిగా నిలిచారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.

తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్ల మైలురాయిని చేరుకున్నారు. దక్షిణ భారతదేశంలో వన్ మిలియన్ ఫాలోవర్లు ఉన్న తొలి మహిళా నేత కల్వకుంట్ల కవిత కాగా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు ఇంత పెద్దఎత్తున ఫాలోవర్లను పొందడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి సైతం మాజీ ఎంపీ కవితకు ట్విట్టర్ లో ఫాలోవర్లు ఉన్నారు.

దశాబ్దకాలం క్రితం.. సామాజిక మాధ్యమాలు ప్రజల్లోకి అప్పుడప్పుడే వస్తున్న రోజులు. అందులోనూ, ట్విట్టర్ గురించి తెలిసిన వాళ్లు, వాడుతున్న వాళ్లూ చాలా తక్కువే. అలాంటి సమయంలోనే, 2010 సంవత్సరంలో మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ లో ఖాతా ప్రారంభించి, సరికొత్త ఒరవడికి తెరలేపారు. నిరంతరం ప్రజా క్షేత్రంలో చురుగ్గా ఉంటూ, ప్రజలతో మమేకం అవుతూనే, మాజీ ఎంపీ కవిత దశాబ్ద కాలంగా ట్విట్టర్ లోనూ ఎప్పటికప్పుడు వివిధ అంశాలను షేర్ చేస్తుంటారు.

తెలంగాణ ఉద్యమం కాలంలో టీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యక్ష ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న కల్వకుంట్ల కవిత, సామాజిక వేదికల్లోనూ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ను బలంగా వినిపించారు. ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వివరాలను, తెలంగాణ జాగృతి కార్యక్రమాలను నెటిజెన్లతో పంచుకునే మాజీ ఎంపీ కవిత, ప్రజల్ని చైతన్యపరిచే వివిధ అంశాలను షేర్ చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని, తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా నలుదిశలా చాటారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించిన మాజీ ఎంపీ కవిత, వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులకు సైతం బతుకమ్మ విశేషాలు తెలియజేసేలా ట్విట్టర్ ను ఒక మాధ్యమంగా ఉపయోగించారు. మాజీ ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో బతుకమ్మ పదానికి చోటు లభించింది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్బంలో, ఉద్యమకారులపై జరుగుతున్న దాడులను, ఉద్యమ వివరాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. తెలంగాణ కోసం పోరాడుతున్న వారికి, మద్దతు తెలిపిన వారికి, పార్టీలకతీతకంగా కృతజ్ఞతలు తెలిపారు మాజీ ఎంపీ కవిత. లోక్ పాల్ బిల్లు కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించిన మాజీ ఎంపీ కవిత, మాజీ ఐఆర్ ఎస్ అధికారి, ప్రస్తుత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజకీయ ఆరంగ్రేటానికి ట్విట్టర్ వేదికగా మద్దతు తెలిపారు.

సాధారణంగా మహిళలకు, అందులోనూ ప్రాంతీయ పార్టీ నేతలకు ఉండే పరిమితులను సైతం అధిగమిస్తూ, తన మేధస్సు, వాక్ఛాతుర్యంతో ఢిల్లీ స్థాయిలో సైతం మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు మాజీ ఎంపీ కవిత. తొలిసారి ఎంపీగా గెలిచిన తరువాత, పార్లమెంటులో వివిధ అంశాలపై మాట్లాడుతూ తన వాక్షాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న కవిత గారు, బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తను ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో, కీలక అంశాలైన పసుస బోర్డు, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, బీడీ కార్మికుల సంక్షేమంపై చట్టసభలతో పాటు, ట్విట్టర్ లో సైతం నిరంతరం ప్రస్తావిస్తున్నారు మాజీ ఎంపీ కవిత. ప్రత్యక్ష రాజకీయాల్లో సైతం, మాజీ ఎంపీ కవిత తొలినుంచీ ఎంతో హుందాగా వ్యవహరించారు. పార్లమెంటులో, పబ్లిక్ మీటింగుల్లో వివిధ అంశాలపై నిర్మాణాత్మకంగా ప్రసంగించిన మాజీ ఎంపీ కవిత, ఏనాడూ విలువలు కోల్పోయి రాజకీయాలు చేయలేదు.

బ్లడ్ డొనేషన్, సోషల్ సర్వీస్ లాంటి అంశాలతో పాటు ప్రజల్ని చైతన్య పరిచే వాటి గురించి ట్విట్టర్ వేదికగా మాజీ ఎంపీ కవిత పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ముఖ్యమైనది హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తూ 2017లో మాజీ ఎంపీ కవిత నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. #sisters4change పేరుతో మాజీ ఎంపీ కవిత ప్రారంభించిన హెల్మెట్ అవగాహనా కార్యక్రమానికి, ట్విట్టర్ వేదికగా పలువురు సెలబ్రెటీలు మద్దతుగా నిలిచారు. ప్రముఖ నటులు మహేష్ బాబు నాని, క్రికెటర్ గౌతమ్ గంభీర్ వీరేంద్ర సెహ్వాగ్, మరియు ప్రపంచ ఛాంపియన్లైన పివి సింధు, వినేష్ ఫోగట్, గగన్ నారంగ్ ఇలా అందరూ ఆ కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పొంది మద్దతు తెలిపారు. రాఖీ పండుగనాడు ప్రతి మహిళ తమ సోదరులకు రాఖీ కట్టడంతోపాటు ఒక హెల్మెట్‌ను బహూకరించాలని కవిత ఇచ్చిన పిలుపు దేశవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంది.

సామాజిక మాధ్యమాలతో పాటుగా, సామాజిక సేవలోనూ మాజీ ఎంపీ కవిత ముందువరుసలో ఉన్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సొంత డబ్బులతో అన్నదాన కేంద్రాలను నిర్వహిస్తున్న మాజీ ఎంపీ కవిత, కరోనా వైరస్ నేపథ్యంలో మరో ముందడుగు వేసారు. లాక్ డౌన్ కారణంగా తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు, నిరుపేదల కష్టాలను చూసి చలించిన కవిత, వారి కడుపు నింపేందుకు గాను, కరోన సమయంలోనూ వాటిని కొనసాగించడంతో పాటు, నిజామాబాద్, జగిత్యాలలో మరో మూడు అన్నదాన కేంద్రాలను ప్రారంభించారు. ఈ ఆరు అన్నదాన కేంద్రాల ద్వారా ప్రతిరోజు 3వేల మంది అన్నార్తులకు భోజనం అందిస్తున్నారు. అంతేకాదు కరోనా వైరస్ పై పోరులో అహర్నిషలు కష్టపడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రాత్రి వేళ భోజనం అందించడం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయించారు మాజీ ఎంపీ కవిత.

కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇలాంటి సమయంలోనే ట్విట్టర్ మాధ్యమాన్ని మానవత్వానికి వేదికగా మార్చారు మాజీ ఎంపీ కవిత. లాక్ డౌన్ కారణంగా నేరుగా కలిసి సమస్యలు చెప్పుకోలేని వారికి, కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాదిమందికి, కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా ఆపన్న హస్తం అందించారు. రాష్ట్రం ఏదైనా, దేశం ఏదైనా… తెలంగాణ వాసులు సాయం కోరుతూ, ట్వీట్ చేసిన వెంటనే, వెన్నుతట్టి ఆదుకున్నారు మాజీ ఎంపీ కవిత. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో కరోనా సమయంలో తిండి లేక ఇబ్బుందులు పడుతున్నా, స్వస్థలానికి రావడానికి ప్రయత్నిస్తున్నా, అనారోగ్యంతో ఉన్నా…వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, ఆయా ప్రాంతాల అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరితగతిన సహాయం అందేలా చేశారు.

విదేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వలస కార్మికులకు కవిత చేదోడువాదోడుగా నిలిచారు. గల్ఫ్ దేశాల నుండి తెలంగాణ వాసులను స్వస్థలాలకు చేర్చడంతో పాటు, గల్ఫ్ దేశాల్లో వివిధ కారణాలతో మరణించిన తెలంగాణ వాసులకు అంత్యక్రియలు సైతం నిర్వహించేందుకు ట్విట్టర్ ను ఒక మాధ్యమంగా ఉపయోగించారు మాజీ ఎంపీ కవిత. అంతేకాదు కరోనాపై పోరాటంలో ముందువరుసలో ఉన్న వైద్య, పోలీసు, సానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన మాజీ ఎంపీ కవిత, #ThankYouwarriors పేరుతో, వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన మహిళా నాయకురాలిగా, పరిమితులను అధిగమించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ లో వన్ మిలియన్ ఫాలోవర్లను సాధించి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మాజీ ఎంపీ కవిత తర్వాత దక్షిణాది నుంచి అత్యధిక ఫాలోవర్స్ కలిగిన మహిళా నేతలలో మాజీ కాంగ్రెస్ సోషల్ మీడియా దివ్య స్పందన, డీఎంకే ఎంపీ కనిమొయి, తెలంగాణ గవర్నర్ తమిలిసై సౌందరరాజన్, బీజేపీ ఎంపీ శోభ కరంగ్దలే మరియు ఇతరులు ఉన్నారు.ఈ సందర్భంగా ఫాలోవర్లకు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -