వెండితెరపై ‘సిసింద్రీ’ చేసిన అల్లరికి పాతికేళ్లు అయింది. బుడిబుడి అడుగుల ప్రాయంలో ఉన్నప్పుడు కింగ్ నాగార్జున తనయుడు, నేటి యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన చిత్రం ‘సిసింద్రీ’. ‘బేబీస్ డే అవుట్’అనే హాలీవుడ్ మూవీ ఆధారంగా రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను గ్రేట్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మించారు. ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు.
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుణ్ని ఎవరో కిడ్నాప్ చేస్తే తల్లి మనసు ఎంత గాయపడుతుందో అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో సిసింద్రీ
గా అఖిల్ ఎంతటి మాయ చేశాడో మాటల్లో చెప్పలేం. ఇంకా మాటలు కూడా రాని వయసులోనే నటించాడో, జీవించాడో తెలియనంతగా అలరించాడు. ఇందులో అఖిల్ తల్లి దండ్రులుగా శరత్ బాబు, ఆమని నటన ఆకట్టుకుంటుంది. శరత్ కుమార్ తమ్ముడిగా శివాజీ రాజా నెగిటివ్ రోల్‌లో కనిపించి రక్తి కట్టించాడు. అన్నయ్య మీద కోపంతో సిసింద్రీని కిడ్నాప్ చేసేందుకు ప్రణాళిక రచిస్తాడు శివాజీ. ఇందుకు అక్కన్న, మాదన్న, జక్కన్న (తనికెళ్ల భరణి, సుధాకర్, గిరిబాబు)ల సహాయం తీసుకుంటాడు. అలా అపహరించిన ఆ గ్యాంగ్‌ను సిసింద్రీ తన చిలిపి పనులతో ఆటాడుకుంటాడు. మరోవైపు కొడుకు కనిపించలేదనే బాధతో ఉన్న శరత్, ఆమనిలకు నాగార్జున తోడై, సాహసించి సిసింద్రీని ఆ ముఠా నుంచి రక్షించి తల్లిదండ్రులకు అప్పగిస్తాడు. అతిథి పాత్రలు పోషించిన టబు, పూజా సినిమాకు కొత్త కళ తీసుకొచ్చారు. బ్రహ్మానందం, ఎ.వి.ఎస్ కామెడీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. చిన్న పిల్లల కథాంశంతో తెరకెక్కిన చిత్రాల్లో ‘సిసింద్రీ’ ప్రత్యేకంగా నిలుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. వెండితెరపై ‘సిసింద్రీ’ చేసిన అల్లరికి పాతికేళ్లు అయింది. ఈ అపురూపమైన చిత్రం 1995 సెప్టెంబరు 14న విడుదలై నేటితో 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది.
శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఇందులో నటించిన నటులంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా రాజ్(రాజ్-కోటి ద్వయంలో ఒకరు) సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధానంగా నిలిచింది. ఎస్ .గోపాల్ రెడ్డి కెమెరాపనితనం, సీతారామశాస్త్రి పాటలు ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గీత రచనలో రాజ్ స్వరపరిచిన ‘చిన్ని తండ్రీ నిను చూడగా’ అనే పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. అలాగే “ఆటాడుకుందాం రా”, “హలో పిల్లా”, ‘క్యా సీన్ హై” వంటి గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 1995 సెప్టెంబరు 14న విడుదలైన ‘సిసింద్రీ’ చిత్రం రెండు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. తెలుగు చిత్రసీమకు సంబంధించి సిసింద్రీ ఓ ప్రయోగం. అంత చిన్న వయసు పిల్లాడి కథతో.. మరోసారి అలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు కూడా.