కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని మంత్రి కె.తారక రామారావు సిరిసిల్లా జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతోపాటు సిరిసిల్లా పట్టణాన్ని అదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ దిశగా అవసరం అయిన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ దిశగా పనిచేయాలని అధికారులను అదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులపైన కూడా మంత్రి సమీక్షించారు. సిరిసిల్లాలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ది పనులు మరింత వేగంగా పరుగులెత్తించాలని మంత్రి అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
ఈరోజు జిల్లా అధికారులతో హైదరాబాద్ ప్రగతి భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో నియోజక వర్గంలో జరుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ది పనులుపైన పురోగతిపైన వివరాలు తెలుసుకున్నారు. ఈసారి రాష్ర్ట వ్యాప్తంగా వ్యవసాయానికి మంచి కాలం కలిసి వచ్చిందని, సరిపోయిన మేరకు వర్షాలు కురిసాయని అన్నారు. దాదాపు సిరిసిల్లాలోని అన్ని చెరువులు నిండాయని, మంచి పంటలు వచ్చే అవకాశం ఉన్నదన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టు పనులను సాగునీటి శాఖ ఈఏన్ సి, ఇతర ఉన్నతాధికారులు, వర్కింగ్ ఎజెన్సీలతో కలిపి సమీక్షించారు.
పనులను మరింత వేగంగా జరిగేలా చూడాలని మంత్రి వారిని అదేశించారు.జిల్లాలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్ధితులపైన జిల్లా వైద్య శాఖాధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉన్న కరోనా రోగులు ఎంతమంది, వారికి అందుతున్న సేవలు, వారికి కేటాయించిన ఐసోలేషన్ సౌకర్యాలు, వైద్య చికిత్స సౌకర్యాలపైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరోనా కోసం ఉపయోగిస్తున్న మందులు, మాస్కులు, పిపిఈ కిట్లు స్టాకులతోపాటు రోగులకు అందుతున్న అక్సిజన్ సౌకర్యం వంటి వాటిపైన వివరాలు తెలుసుకున్నారు. వీటికి సంబంధించి రెమ్ డెసివిర్, ప్లావిపిరావిర్ వంటి మందులను అందిస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో చేస్తున్న టెస్టింగ్ జరుతున్న విధానం, టెస్టింగ్ కేంద్రాలు, టెస్టింగ్ కిట్ల సంఖ్య వివరాలు తెలుసుకున్నారు. కరోనా విషయంలో ప్రస్తుతం జిల్లాలో అందిస్తున్న సేవల పట్ల ఏలాంటి ఇబ్బందులు లేవని జిల్లా అధికారులు మంత్రికి తెలిపారు.
క్లస్టర్ అసుపత్రులపైన మరింత దృష్టి పెట్టాలని సూచించారు. ఏల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పిహెచ్ సిల ఏర్పాటుపైన వేగంగా ముందుకు కదలాలని సూచించారు. నర్సింగ్ కాలేజీ పనులపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.సిరిసిల్లా పట్టణానాన్ని అదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. పట్టణంలో కొనసాగుతున్న పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. వీలీన గ్రామాల్లోనూ అభివృద్ది కార్యక్రమాలు వేగంగా కొనసాగేలా చూడాలన్నారు. పట్టణాన్ని సందర్శించి పట్టణ పురోగతి పనులను సమీక్షించాలని సిడిఏంఏ సత్యనారాయణను అదేశించారు. జిల్లా కలెక్టరెట్ భవన నిర్మాణ పనులను ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లాలో రైతు వేధికల నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 154 గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతి వనాల పనులు జరుగుతున్న తీరుని సమీక్షించారు.ఈ సమావేశంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖా ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు హజరయ్యారు.