కేసీఆర్‌ నీళ్లతో.. కేసీఆర్‌ మక్కతోట

333
srsp
- Advertisement -

ఇది ముమ్మాటికి కేసీఆర్‌ వరద కాలువ నీళ్లతో పండిన పంట. బోరు నీళ్లతో పండింది కాదు. ఇది కేసీఆర్‌ మక్క తోట’ అంటూ ఓ రైతు ధైర్యంగా చెబుతున్నాడు. నర్మగర్భంగా ఆ రైతు మాట్లాడిన తీరు.. చెప్పిన విషయాలు సామాజిక మాధ్యల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలతో సాగు పండుగ చేసుకుంటున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా చేశారంటూ నోరు పారేసుకున్నాయి. కాళేశ్వరం ఫలాలు అందుతున్నాయని చెప్పడానికి కండ్లకు కన్పించే పంటలే సమాధానం. తలాపున శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఉన్నా ఆ ప్రాంత రైతులకు ఇంతకాలం చేకూరిన ప్రయోజనం అంతంతే. వానల కోసం మొగులు వైపు ఆశగా ఎదురు చూసిన అన్నదాతల మోములో ఇప్పుడు సంబురం కనిపిస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా ఈసారి వరద కాలువ ద్వారా ఎదురెక్కిన కాళేశ్వరం జలాలు జగిత్యాల జిల్లాతోపాటు నిజామాబాద్‌ జిల్లాబాల్కొండ నియోజకవర్గంలోని 16 గ్రామాలకు సాగుకు పండుగను తీసుకొచ్చింది. వానకాలం ఆరంభంలోనే చినుకు లేకున్నా.. తెలంగాణ ప్రభుత్వం వరద కాలువలోకి ఒక టీఎంసీ కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడంతో ఎదురెక్కిన గోదావరి జలాలు ఎస్సారెస్పీ దిగువ ఉన్న భూములను తడిపాయి. సీఎం కేసీఆర్‌ కృషితో నిండుకుండలా మారిన చెరువులను చూసి రైతులు మురిసిపోయారు. ధైర్యంగా పంటలు సాగుచేశారు.సమృద్ధిగా పంటలు చేతికొస్తుండటంతో ఆనందంతో ‘కేసీఆర్‌ నీళ్లతో.. కేసీఆర్‌ మక్కతోట’ అంటూ వారి సంతోషాన్ని పది మందితో పంచుకుంటున్న క్షణాలు చూస్తుంటూనే సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుండటం విశేషం.

వందశాతం కేసీఆర్‌ నీళ్లే..

హైదరాబాద్‌లో ఉద్యోగ రీత్యా స్థిరపడిన నిజామాబాద్‌ జిల్లా బాల్కొండకు చెందిన కొంత మంది యువకులు కరోనా కారణంగా స్వస్థలాలకు వచ్చారు. అలా సేదతీరేందుకు పొలాల గట్లపై వెళ్తుండగా వన్నెల్‌(బి) గ్రామ శివారులో ఎదురొచ్చిన రైతు శ్రీనివాస్ ను పలుకరించారు. ఆయన చెప్పిన మాటలు విని, అక్కడి పంటను చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ‘ఇది కేసీఆర్‌ వరద కాలువ నీళ్లతో పండిన పంట. మా బోరు నీళ్లతో పండింది కాదు. వంద శాతం. మక్కంతా కేసీఆర్‌ నీళ్లతో పండిన పంట’ అంటూ ఆ రైతు వారితో చెప్పుకొచ్చాడు. కేసీఆర్‌ మక్కంటూ ఫేస్‌బుక్‌లో పెట్టు అని పురమాయించాడు. ఈ వీడియోను సరదాగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో హల్‌చల్‌ అయింది. సహజ సిద్ధంగా, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకున్నది. వీడియో చూసిన వారంతా.. వరద కాలువలోకి ఎదురెక్కిన కాళేశ్వరం జలాల గొప్పతనంపై చర్చించుకుంటుండటం విశేషం.

- Advertisement -