మాజీ ప్రధానమంత్రి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారికి దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. పీవీ శతజయంతి ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ లో సమాలోచన సభ నిర్వహించారు. అన్ని అర్హతలూ ఉన్న పీవీ కి తక్షణమే భారతరత్న ప్రకటించాలని మాజీ ఎంపీ కవిత సభలో తీర్మానం ప్రవేశ పెట్టాగా, సభ హర్షధ్వానాలతో తీర్మానాన్ని ఆమోదించింది.
తెలంగాణ తేజం మన పీవి (సాహితీ సౌరభం – అసమాన దార్శనికత) పేరుతో, మాజీ ఎంపీ కవిత అధ్యక్షతన సమాలోచన సభ జరిగింది.ఎంపీ, పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కే.కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కూతురు వాణిదేవి, రచయిత కల్లూరి భాస్కర్, టీఆర్ఎస్ ఎన్నారై సెల కన్వీనర్ మహేష్ బిగాల హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత మాట్లాడుతూ, దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉండగా పీవీ నరసింహారావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఐదేళ్లపాటు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారని మాజీ ఎంపీ కవిత తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉండే పెద్ద మనస్సుతోనే ఇది సాధ్యం అయ్యిందని చెప్పారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన జాగృతి బుక్ క్లబ్ పేరును పీవీ బుక్ క్లబ్ గా మార్చామన్నారు. జాగృతి ఆధ్వర్యంలో ప్రతినెలా రెండు పీవీ క్లబ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పీవీ బుక్ క్లబ్’ పేరుతో, ప్రాచీన పుస్తకం, నవీన పుస్తకం పేరుతో ప్రతి నెలా రెండు కార్యక్రమాలు నిర్వహించి, పీవీ కి అక్షర నివాళి పాటిస్తామన్నారు.పీవీ నరసింహారావు సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్ర వ్యాప్తంగా శతజయంతి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు మాజీ ఎంపీ కవిత పిలుపునిచ్చారు.
పీవీ నరసింహారావు , వారి మేధస్సు ను దేశం కోసం ఉపయోగించారన్న మాజీ ఎంపీ కవిత, రాజకీయ ల్లో ప్రత్యర్థులు సైతం పొగిడేంత, హుందాతనం తో పీవీ వ్యవహరించారని గుర్తుచేసుకున్నారు.పీవీ నరసింహారావు కూతురు వాణిదేవి మాట్లాడుతూ, పీవీ తొలిసారి జైళ్లశాఖను నిర్వర్తించి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు.పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను నిర్వర్తిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన వాణిదేవి, పీవీ సాహిత్యాన్ని యువతరానికి అందించేందుకు తెలంగాణ జాగృతి చేస్తున్న కృషిని అభినందించారు. సమాజం గురించి, వ్యవస్థల్లోని లోటుపాట్ల గురించి పీవీ అనేక రచనలు చేశారని తెలిపారు పీవీ తనయుడు ప్రభాకర్ రావు.
ఈ సభలో పాల్గొన్న టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మహేష్ బిగాల మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకాలతో 51 దేశాలలో పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, అంతేకాక 5 దేశాలలో పీవీ నరసింహారావు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.పీవీ నరసింహారావు రచించిన ఇన్ సైడర్ పుస్తకం, పీవీ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తుందన్నారు ప్రముఖ రచయిత, ఇన్ సైడర్ అనువాదకుడు కల్లూరి భాస్కర్. పీవీ నరసింహారావు బయోపిక్ తీసుకువస్తే బాగుంటుందని కల్లూరి భాస్కర్ అభిప్రాయపడ్డారు.
రాజ్యసభ సభ్యులు కే కేశవరావు మాట్లాడుతూ, పీవీ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. విదేశాంగ విధానం, ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, భూ సంస్కరణలు.. ఇలా అనేక రంగాల్లో పీవీ నరసింహారావు సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించాలంటూ, మాజీ ఎంపీ కవిత ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ప్రస్తావిస్తూ, త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.