ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు,కుంటల నిండి మత్తడి పోస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక వర్షాలతో వరంగల్ నగరం నీటమునగగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది నీటిమట్టం రికార్డు స్థాయికి చేరింది. నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 58.1 అడుగులకు చేరింది.
భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన ఉచిత నిత్యాన్నదాన సత్రంలోకి వరద నీరు చేరింది. కల్యాణకట్ట నీట మునిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం చివరి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించడం ఆరేళ్ల తరువాత ఇదే తొలిసారి. తాలిపేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో 25 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.