ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలను తు.చ. తప్పకుండా ఆచరించాలి. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమాన్ని, పారిశుద్ధ్యాన్ని పల్లెల్లో నిరంతరం కొనసాగించాలి. శాఖల పరమైన అభివృద్ధిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. లక్ష్యాలకనుగుణంగా వాటిని పూర్తి చేయాలి. అనేక పథకాల అమలులో మనమే దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం. మిగిలిన అన్ని కార్యక్రమాల్లోనూ మనమే నెంబర్ వన్ గా నిలవాలి. ఈ కరోనా కష్ట కాలంలో ప్రజలన్ని ఆదుకోవడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుండాలి. స్వీయ నియంత్రణ. సామాజిక దూరం, మాస్కుల వినియోగంపై ప్రజలను ప్రమత్తం చేయండి. వైరస్ విస్తృతి ఉన్నప్పటికీ, పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల కారణంగానే తెలంగాణ సురక్షితంగా ఉంది. సీజనల్ వ్యాధులు సైతం అతి తక్కువగా మాత్రమే కాదు, అదుపులో ఉన్నాయి. ఇదే తరహాలో అధికారులు తమ విధులను నిర్వర్తించాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
అధికారులు చురుకైన, సమర్థవంతమైన పనితీరుతో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి ఉద్బోధించారు. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గల రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన పేషీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై జిల్లాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో నెంబర్ వన్ గా నిలిచిన సీఎం కెసిఆర్ నిర్దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విభాగాల్లోనూ, అభివృద్ధి, సంక్షేమంలో నూ నెంబర్ వన్ గా నిలిస్తున్నదన్నారు మంత్రి ఎర్రబెల్లి.కరోనా కష్టకాలంలోనూ అభివృద్ధి, సంక్షేమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ దశలో రైతులకు అన్ని విధాలుగా తోడుగా నిలిచిన ప్రభుత్వం, సాగునీరందిస్తూనే, రైతు వేదికలు, కల్లాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. వాటిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు కూడా పూర్తి కావాలన్నారు. ప్రకృతి వనాలకు స్థలాలు గుర్తించి వెంటనే మొక్కలు నాటాలన్నారు. నర్సరీలలో మొక్కల పెంపకం కొనసాగాలన్నారు.
హరిత హారంలో ఇప్పటికే 91శాతం మొక్కలు నాటామని, గత ఏడాది నాటిన మొక్కల్లో 95శాతం మొక్కలని బతికించుకున్నామని మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల బడ్జెట్ లో 10శాతం గ్రీనరీ కోసమే ఖర్చు చేయాలన్నారు. పల్లె ప్రగతి, నిరంతర పారిశుద్ధ్యం కార్యక్రమాలు కొనసాగాలని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. పల్లె ప్రగతి కారణంగానే పల్లెలు కరోనా విస్తృతిలోనూ సురక్షితంగా ఉన్నాయన్నారు. ఈ వానా కాలం సీజన్ లోనూ అంటు వ్యాధులు అతి తక్కువగా ఉన్నాయని, అవి కంట్రోల్ లోనే ఉన్నాయని మంత్రి తెలిపారు.
ఇక కరోనా వైరస్ విస్తృతిని అడ్డుకోవడానికి వీలుగా ప్రజల్లో స్వీయ నియంత్రణని,సామాజిక దూరం పాటించడం, మాస్కుల వినియోగంపై అవగాహన, చైతన్యాలను పెంచి, అప్రమత్తం చేయాలన్నారు.అన్ని గ్రామాల్లోనూ డప్పు చాటింపులు వేయాలన్నారు. ఉపాధి హామీలోనూ ఇప్పటికే 75శాతం పూర్తి చేసి,దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కరోనా కష్ట కాలంలో గ్రామాలకు తిరిగి వచ్చిన వాళ్ళకోసం అదనంగా కొత్తగా జాబ్ కార్డులు ఇచ్చి, విరివిగా ఉపాధి కల్పించిన ఘనత కూడా మన రాష్ట్రానిదేనన్నారు.
PMGSY మొదటి దశలో 1028 కిలో మీటర్ల నిడివి గల రోడ్ల నిర్మాణానికి, రూ. 658 కోట్ల బడ్జెట్ తో మంజూరు అయిన 158 పనులకు టెండర్లు పిలిచామని, దేశంలోనే మొట్ట మొదట టెండర్లు పిలిచిన రాష్ట్రం మన తెలంగాణ అని మంత్రి ఎర్రబెల్లి అధికారులకు తెలిపారు. ఇంకా 1500 కిలో మీటర్లు రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరీ చేయవలసి ఉందన్నారు. బ్యాంకు లింకేజీ, మహిళా గ్రూపులకు ఆర్ధిక సహాయం చేయడంలో రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందన్నారు.
EGS ఆడిట్ ఆన్ లైన్ లో, మిషన్ భగీరథలోనూ ఆదర్శంగా నిలిచామన్నారు. ఇప్పటికే 6 అవార్డులను గెలుచుకున్నామని మంత్రి వివరించారు. ఈ ఒరవడిని కొనసాగిస్తూ, దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపుతూ, సీఎం కెసిఆర్ గారు పడుతున్న కష్టాన్ని సార్థకం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్ రావు, ఇజిఎస్ కమిషనర్ సైదులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, జిల్లాల పంచాయతీ అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.