ప్రతి ఊరుకో డంపు యార్డులనిచ్చాం…ఆయా డంపు యార్డులు సాధ్యమైనంత వేగంగా నిర్మాణాలు జరగాలి. చెత్త సేకరణ సమయంలోనే తడి, పొడి చెత్త వేరు కావాలి. ఆలా కాకపోతే, డంపు యార్డుల్లో కచ్చితంగా జరగాలి. అదే సమయంలో సేంద్రీయ ఎరువుల తయారీని చేపట్టాలి. ఆ ఎరువులతో బంగారు పంటలు పండించాలి అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. అధికారులకు సహకరించాల్సిందిగా సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పల్లె ప్రగతిలో భాగంగా నిర్మిస్తున్న డంపు యార్డులు, తడి పొడి చెత్త నిర్వహణ, సేంద్రీయ ఎరువుల తయారీపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా రూపొందించిన నియమావళితో కూడిన మాన్యువల్ ని హైదరాబాద్ లోని మంత్రుల ఆవాసంలోని తన నివాసంలో బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ గారు ఊరూరా డంపు యార్డులను మంజూరు చేశారన్నారు. ఆయా డంపు యార్డులను పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే కొన్ని గ్రామాల్లో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల్లోనూ కొంత స్పష్టత రావడం లేదన్నారు. అందుకే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డంపు యార్డుల నిర్మాణాలు, తడి, పొడి చెత్త నిర్వహణ, సేంద్రీయ ఎరువుల తయారీపై నియమావళిని సిద్ధం చేసిందన్నారు. ఈ నియమావళిని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు.
అయితే, నియమావళిలోని మార్గదర్శకాలను అనుసరించి తడిపొడి చెత్త నిర్వహణతోపాటు, సేంద్రీయ ఎరువులను తయారు చేయాలని సూచించారు. కచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అలాగే డంపు యార్డులను వేగంగా పూర్తి చేసుకోవాలన్నారు. డంపు యార్డుల చుట్టూ ఫెన్సింగ్ గా పొడవైన బాగా పెరిగే మొక్కలను నాటుకోవాలని చెప్పారు. హరిత హారంలోనే ఈ మొక్కలు నాటాలన్నారు.
పల్లెలను పరిశుభ్రంగా ఉంచడానికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పల్లె ప్రగతితోపాటు, సిఎం కెసిఆర్ గారు పిలుపునిచ్చిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం కూడా విజయవంతమైందన్నారు. అందుకే పల్లెల్లో కరోనా వైరస్ విస్తృతి తక్కువగా ఉందన్నారు. పచ్చదనం-పరిశుభ్రత వెల్లివిరిస్తే, ఆరోగ్య తెలంగాణ సాధ్యమవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అధికారులు ఆ దిశగా పని చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.