ఈ రోజు సూర్యాపేట జిల్లాలో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇందులో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్డీవో కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి కేటీఆర్‌తో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పాలనను ప్రజల ముంగిటకు తెస్తూ సీఎం కేసీఆర్ పరిపాలన సంస్కరణలకు తెరలేపారన్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నేడు సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు వచ్చాయని తెలిపారు. చిట్ట చివరి మనిషి వరకు ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఉపేక్షించేది లేదని, వారిపట్ల కఠినంగానే ఉంటామని హెచ్చరించారు.హైదరాబాద్ గొప్ప మెట్రోపాలిటన్ నగరమని తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు హైస్పీడ్ రైలు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ అన్నారు.
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామని ఆయన తెలిపారు. హుజూర్‌నగర్‌లో సిల్క్ డెవలప్మెంట్ సెంటర్‌ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇలాంటి కష్టకాలంలోనూ రైతులకు రైతు బంధు కింద కేసీఆర్ సాయం చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.