సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉధృతంగా పాల్గొనాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. జీవ వైవిధ్యం, పర్యావరణాన్నికాపాడే విధంగా అంతా పాటు పడాలని చెప్పారు. 6వ విడతగా ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వీలుగా, సన్నాహక చర్యల్లో భాగంగా మంత్రి ఎర్రబెల్లి, హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో గల తన చాంబర్ సమావేశ మందిరం నుంచి అడిషనల్ కలెక్టర్లు, జెడ్పీ సీఇఓలు, డిఆర్ డిఓలు, డిఎఫ్ ఓలు, డిపిఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, సిఎం కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మొక్కలు నాటి, పెంచే తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. 24శాతంగా ఉన్న అటవీ ప్రాంతాన్ని33శాతానికి పెంచడమే లక్ష్యం. తద్వారా వాతావరణ సమతౌల్యాన్ని కాపాడటం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం, సకాలంలో వర్షాలు పడే విధంగా చేయడం వంటి అనేక ప్రయోజనాలు పొందే విధంగా కోట్లాది మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధందగా తెలంగాణ హరితహారం అమలు అవుతున్నదన్నారు. ఇప్పటికే ఐదు విడతలుగా నిర్వహించిన తెలంగాణకు హరిత హారం కార్యక్రమం వల్ల అనేక మొక్కలు మనుగడలో ఉన్నాయన్నారు. పండ్ల మొక్కలు, ఇంట్లో పెంచుకునే మొక్కలు, ఖర్జూర, ఈత, ఉసిరి, రేగు, సీతాఫలం వంటి మంకీ ఫుడ్ కోర్ట్స్, గులాబీ మందార, గన్నేరు, తులసి వంటి పువ్వులు, అలంకారానికి, దోమలు రాకుండా ఉండేందుకుక వీలైన రకరకాల మొక్కలు 30 రకాల మొక్కలు నర్సరీలలో పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా ఉందని మంత్రి చెప్పారు.
కాగా, ఇందులో గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యం 12కోట్ల 67లక్షల మొక్కలు నాటడమని, అవన్నీ నిర్ణీత కాలంలో నాటడమే కాకుండా, అవి పెరిగేలా చూడాలని, వాటిని సంరక్షించి, నూటికి నూరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఉపాధి హామీ కింద నర్సరీలు, సామాజిక తోటల పెంపకం కింద 25 కోట్ల మొక్కలు సిద్ధం చేశామని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. హరిత హారం -2020 ప్రాధాన్యతపై సన్నాహక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంచనా ఉత్పత్తికి ముందు మ్యాచింగ్ బ్యాచింగ్, ఫిట్టింగ్ చేయాలన్నారు. నర్సరీలలో మొక్కల లభ్యతని గుర్తించాలి. మండలాల వారీగా, మొక్కల జాతుల వారీగా స్టాక్‌ను అంచనా వేయాలి. అవెన్యూ తోటలు కాకుండా ఇతర మొక్కలను పెంచడానికి గుర్తించాలి. అన్నారు. అలాగే తొందరగా పెరిగే మొక్కలు, నాటే సమయానికి కాస్త ఎత్తైన మొక్కలను ఎంచుకోవాలని సూచించారు.