బలపం పట్టాల్సిన చేతులు బండెడు చాకిరీ చేస్తున్నాయి. పేదరికంతో చదువులు చతికిలపడుతుండగా అభంశుభం తెలియని చిన్నారులు కుటుంబ పోషణలో సమిధులవుతున్నారు. చదువు,ఆటలతో గడపాల్సిన బాల్యం..హోటళ్లలో సర్వర్లుగా, సర్వెంట్లుగా, చెత్త ఏరుకునే వారిగా,పేపర్‌బాయ్‌లుగా హృద్యమైపోతున్నాయి.
అందుకే ప్రపంచవ్యాప్తంగా బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంగా జరుపుకున్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, ఉద్యోగులు మరియు వివిధ ఎన్జీవో సంస్థలు ఎన్నో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తాయి.
బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా సర్వేల ద్వారా తేల్చిన విషయాలివే. వ్యవసాయంలోనూ, ఇతరత్రా పనుల్లో తల్లిదండ్రులకు సాయంగా వెళ్ళేవారు కొందరయితే, కర్మాగారాల్లో, దుకాణాల్లో, ఇతరత్రా పనుల్లోకి వెళ్ళి తల్లిదండ్రులకుఆర్థికసాయాన్ని అందించేవారు మరికొందరు.
ఏటా ఏదో సందర్భోచితంగా బాలకార్మికులను పట్టుకొని బడిలో పడేసి చేతులు దులిపేసు కుంటున్న చర్యలు పెద్దగా ప్రయోజనం ఇవ్వడం లేదు.కొన్నేళ్లుగా ఈ తంతు నడుస్తున్నా ఫలితం పెద్దగా కానరావడంలేదు. బడిలో పేరున్నా బయటే పిల్లలు ఉంటున్నారు. అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టకపోవడంతో బాలకార్మిక చట్టం అలంకారప్రాయంగా మారుతోంది. పల్లెల కంటే పట్టణాల్లోని మురికి వాడల్లో బాలకార్మికులు ఎక్కువ కన్పిస్తున్నారు.
బాలకార్మిక వ్యవస్ధను ఇలా నిర్మూలించవచ్చు..
()బాలకార్మిక వ్యవస్థపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.
()సమాజంలో మార్పు తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ఎంతోకొంత కృషిచేయాలి.
()సంస్థలు వారి కార్యకలాపాల్లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను ఒక భాగంగా చేయాలి.
() ముందుగా మన ఇళ్లల్లో పిల్లలు పనిచేయకుండా చూడాలి.
()మన చుట్టూ ఉండే చిన్నారులు పాఠశాలలకు వెళ్లేలా చూడాలి.
() పిల్లలను పనికి పంపేవారికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూపాలి.
సమా జంలో భాగస్వాములైన మనమందరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. దేశ అభివృద్ధికి అవరో ధంగా నిలుస్తున్న బాలకార్మిక వ్యవస్థను తరిమి కొట్ట డానికి ప్రతి ఒక్కరం కృషిచేద్దాం…