డబుల్ బెడ్రూం ఇల్లు పేదింటి ఆడబిడ్డ ఆత్మగౌరవ ప్రతీకగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ఆయన బుధవారం ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బి కార్యాలయంలో గృహ నిర్మాణ మరియు ఆర్ అండ్ బి పనుల పురోగతి పై వేరువేరుగా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్ డౌన్ నేపథ్యంలో పనుల్లో కొంత జాప్యం జరిగిన ఆన్ గోయింగ్ పనుల్లో వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు.ప్రతి పల్లెకు మంచి రోడ్డు సౌకర్యం ప్రగతికి చిహ్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తారని దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
లక్ష బెడ్రూం ఇల్లు ఈ దసరా నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అదేశించారని, ఆ మేరకు పనుల్లో వేగం పెంచి ఇండ్ల నిర్మాణం పూర్తి చేసేలా కృషి చేయాలని అన్నారు.లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు.ఆల్రెడీ పనులు ప్రారంభమై లాక్ డౌన్ వల్ల పెండింగ్ లో ఉన్న రోడ్ల గురించి మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.