రైతులకు మేలు జరిగేందుకు కొత్త వ్యవసాయ విధానం తీసుకోస్తున్నామని చెప్పారు మంత్రి హరీష్ రావు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి, ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో దుకాణాల సముదాయంను ప్రారంభించారు మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు పదవి రావడం గొప్ప కాదు.. పదవి నిర్వహించడం గొప్ప అన్నారు. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకే విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లాలో కొత్తగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేశాం అన్నారు.
హైదరాబాద్ మహా నగర అవసరాలు తీర్చేలా పటాన్ చెరు మార్కెట్ ను అభివృద్ధి చేయాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలోనే అత్యుత్తమ మార్కెట్ గా పటాన్ చెరువు మార్కెట్ ను మార్చాలన్నారు. మార్కెట్ వ్యవస్థ కొత్తపుంతలు తొక్కుతోందని… ఇంట్లో కూర్చొనే కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నాం అన్నారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టంలోని నిబంధనలు సైతం మార్చుతాం అన్నారు. ఆన్‌లైన్ మార్కెట్ ప్రజలకు సౌకర్యవంతంగా మారిందని….హైదరాబాద్ మహా నగరానికి నలుదిక్కులా సమీకృత మార్కెట్లు అభివృద్ధి చేస్తాం అన్నారు. సిద్దిపేట మార్కెట్లు రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాయని… సిద్దిపేట మార్కెట్లను చూసే నా నియోజకవర్గంలో మార్కెట్లను అభివృద్ధి చేశాం అన్నారు.
రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకొచ్చామని…. ఒకప్పుడు తినడానికి సరిపోయే పంట కూడా పండని పరిస్థితి రాష్టంలో ఉండేదని…. అరేళ్లలో ఈ పరిస్థితిని అధిగమించామన్నారు. ప్రస్తుతం నిల్వ చేయడానికి గోదాముల లేని స్థాయిలో పంటలు పండుతున్నాయని… ఈ సంవత్సరం 39 లక్షల 40 వేల ఎకరాల్లో వరి పంట పండిందని చెప్పారు.
జనాభా అవసరాలకు అనుగుణంగా ఏ పంటలు ఏ స్థాయిలో అవసరమో విశ్వవిద్యాలయంతో సర్వే చేయించామని… ప్రస్తుతం కేరళ, తమిళనాడు మాత్రమే బియ్యం కోసం మనపై ఆధారపడ్డారన్నారు. కొత్త వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు.. పండిన పంటకు కొనుగోలుకు హామీ ఇవ్వాలన్నారు.
ప్రస్తుత పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రావాలి అన్న లక్ష్యంతో కొత్త విధానం రూపొందిస్తున్నామని… ఒక పంట పండిన తర్వాత అది ఆహారంగా మారే వరకు వందల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఎండాకాలంలో చెరువుల మత్తడి దూకిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. ఈ సందర్భంగా జిన్నారం, గుమ్మడిదలకు గోదాములు మంజూరు చేశారు.