బాలీవుడ్ నటి అనుష్క శర్మతో జనవరి 1న నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహాం వ్యక్తం చేశాడు. నిశ్చితార్ధానికి సంబంధించిన ఆలోచన ఇప్పట్లో లేదని కోహ్లీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఈ మేరకు మీడియాలో వచ్చిన వార్తలన్నీ వదంతులే అన్ని కోహ్లీ కొట్టిపారేశాడు. నిశ్చితార్ధం చేసుకునే ఆలోచన ఉంటే అందులో దాయడానికి ఏమి లేదని అందరికీ తెలిసేలా చేసుకుంటామని విరాట్ తెలిపాడు. రహస్యంగా ఎంగేజ్ మెంట్ చేసుకోవాల్సిన అవసరం తమకు తేదని కోహ్లి ట్విట్టర్‌లో తెలిపాడు.
అనుష్క శర్మ కూడా ఈ వార్తలపై స్పందించింది. కోహ్లీ ట్వీట్ చేసిన ట్వీట్లను అనుష్క రీ ట్వీట్ చేసింది. తాము జనవరి 1న నిశ్చితార్ధం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలన్ని రూమర్లేనంటూ కొట్టిపారేసింది. న్యూఇయర్ రోజున కోహ్లీ అనుష్క ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు గురువారం రోజున జాతీయమీడియాలో వార్తలు వచ్చాయి. దేశంలోని ప్రముఖ న్యూస్ ఛానల్స్ కూడా ఈ వార్తని ప్రసారం చేయడం గమనార్హం.
ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరిస్ ముగిసిన తర్వాత కోహ్లీ తన ప్రేయసి అనుష్కశర్మతో కలిసి న్యూఇయర్ వేడుకలను జరుపుకునేందుకు ఉత్తరాఖండ్ విహారయాత్రలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్‌లోని నరేంద్ర నగర్ ఆనందా హోటల్‌లో వీరిద్దరి నిశ్చితార్ధం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్‌కు సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అనిల్ అంబానీలతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరవుతున్నట్టు గాసిప్స్ వెలువడ్డాయి. ఇప్పటికే అనుష్క కుటుంబసభ్యులు ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని కూడా పుకార్లు షికార్లు చేశాయి.