కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టుటకై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ పీరియడ్ వరకు వలస కార్మికులు, అనాథలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేదలు, అనాథలు, యాచకులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్ జోన్లో వివిధ ప్రాంతాల్లో ఆకలి తీర్చుకునేందుకు దాతలు చేసే అన్నదానం కొరకు వచ్చిన 300 మంది వలస కార్మికులను పునరావాస కేంద్రాలకు తరలించి జిహెచ్ఎంసి ద్వారా భోజన వసతులతో పాటు ఆరోగ్య సంరక్షణ చర్యలను చేపట్టుటకు బన్సిలాల్‌పేటలో ఉన్న మల్టీపర్పస్ ఫంక్షన్‌హాల్‌కు ఆర్టీసీ బస్సులలో తరలించారు.
ప్యారడైజ్ సెంటర్ నుండి 50 మంది, అడిక్‌మెట్ సెంటర్ 50 మంది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 200 మంది వలస కార్మికులను ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ ఫంక్షన్‌హాల్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారి ఆకలిని తీర్చేందుకు మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ ఇంటి నుండి వండించి తెచ్చిన ఆహారపదార్థాలను వలస కార్మికులకు వడ్డించారు. మే 7వ తేదీ వరకు ఇక్కడనే ఉండాలని వలస కార్మికులకు విజ్ఞఫ్తి చేశారు. ఉదయం అల్పాహారంతో పాటు, రెండు పూటల భోజనాన్ని అందించే ఏర్పాట్లను చేయనున్నట్లు తెలిపారు. అలాగే వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణకు వైద్య పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు.
అయితే ఇక్కడ ఆశ్రయం పొందిన వలస కార్మికులు శుభ్రతను, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కూలీలు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న దుకాణాలు, రోడ్ల పక్కన చిరు వ్యాపారులు, హోటల్స్, లాడ్జిలు, తోపుడు బండ్ల వద్ద సహాయకులుగా పనిచేస్తున్నారని, ఇటువంటి వ్యక్తులు ఆయా పని ప్రదేశాల్లోని రాత్రిపూట బస చేస్తుంటారని తెలిపారు. అయితే లాక్ డౌన్ వలన అన్ని వ్యాపార, సంస్థలతో పాటు చిన్న చిన్న దుకాణాలు, టీ కొట్టులు, తోపుడు బండ్లు మూతపడటంతో ఎటువంటి ఆధరణ లేక అక్కడక్కడ షాపుల మందు, దాతలు పెట్టే భోజనం చేస్తూ కాలం గడుపుతన్నారని తెలిపారు. దాతాల ఉద్దేశం మంచిదైనప్పటికీ రోడ్లపైన అన్నదానం చేయడం వలన కరోనా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉన్నదని తెలిపారు.
రోజురోజుకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున అన్ని ముందు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వలస కార్మికులకు రక్షణ కల్పించి సంరక్షణ చేసేందుకుఐ ఫంక్షన్‌హాళ్లలో నెలకోల్పిన షెల్టర్ హోంలకు తరలిస్తున్నట్లు తెలిపారు. బయటి కంటే షెల్టర్హోంలోనే అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. లాక్డౌన్ అనంతరం వలస కార్మికులు తమకు వచ్చిన పనులను చేసుకోవచ్చునని తెలిపారు. అప్పటి వరకు షెల్టర్హోంలలోనే ఉండాలని మేయర్ సతీమణి బొంతు శ్రీదేవి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉంచిన 300 మంది వలస కూలీలకు రెండు పూటలా భోజనం పెట్టేందుకు మందుకు వచ్చిన దాతలు శ్రీనివాస్, సాగర్లను అభినందించారు. శ్రీనివాస్ రైల్వే ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నారు. అలాగే మరో దాత సాగర్ రాంకోటి ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నారు.