జంటనగరాలను కలిపే నెక్లెస్ రోడ్డును మరింత ఆధునీకరించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిర్ణయించింది. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నెక్లెస్ రోడ్డు సుందరీకరణకు ప్రాధాన్యత కల్పించింది. ప్రస్తుతం ఉన్న బ్లాక్ టాప్ రోడ్డు(బీటీ రోడ్)ను వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్(వీడీసీసీ) రోడ్డుగా మార్చే పనులకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టంది.

దాదాపు రూ.26 కోట్ల వ్యయంతో ఆరు కిలోమీటర్ల పొడవున వీడీసీసీ రోడ్డు పనులు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పర్యవేక్షణలో ఇంజినీరింగ్ అధికారులు నిర్వహిస్తున్నారు.లాక్డౌన్ సమయంలో ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారుల అనుమతులతో పనులు ప్రారంభమయ్యాయి. నెక్లెస్ రోడ్డు ప్రారంభం(ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం) నుంచి సికింద్రాబాద్ బుద్దభవన్ సేలింగ్ క్లబ్ వరకు దాదాపు ఆరు కిలోమీటర్ల పొడవు గల నెక్లెస్ రోడ్డు(తారు రోడ్డు) కాస్తా సిమెంట్ కాంక్రీట్ రోడ్డు(సీసీ రోడ్డు)గా రూపొందనున్నది.
హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ అధికారులు నెక్లెస్ రోడ్డులో వీడీసీసీ రోడ్డు పనులు మూడు నెలల కాలంలో పూర్తి చేయాలని సంకల్పించారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయంతో లాక్డౌన్ పిరియడ్ ముగిసిన తర్వాత నెక్లెస్ రోడ్డు వెంట ఒకవైపు ట్రాఫిక్‌ను అనుమతిస్తూ పనులు నిర్వహించనున్నారు.

