వెబ్ మీడియా విస్తృతి విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో.. సంచలనాల కోసం అవాస్తవాలను ప్రచారం చేయడం.. నెటిజెన్స్ ను ఆకట్టుకోవడానికి లేని వార్తలకు ప్రాధాన్యం కల్పించడం వంటి సంఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సినిమా,రాజకీయ నాయకులు,సున్నిత అంశాల గురించి తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని షేక్ చేసిన వార్తలు 2016లో చాలానే ఉన్నాయి. మనదేశంలో ముఖ్యంగా సోషల్ మీడియాకు యూత్ బాగా అట్రాక్ట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో నెట్టింట్లో ఏ చిన్న ఫేక్ వార్తైన…దేశవ్యాప్తంగా రచ్చరచ్చ చేశాయి. అలాంటి సంచలనం సృష్టించిన ఫేక్ వార్తలు మీకోసం….
బెస్ట్ పీఎంగా మోడీని ప్రకటించిన యునెస్కో..
ప్రధాని నరేంద్ర మోడీ అత్యుత్తమ ప్రధాని అని యునెస్కో ప్రకటించిందంటూ నిన్న ఓ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. వేల మంది దాన్ని షేర్ చేసుకున్నారు. ఆయనను అభినందిస్తూ కొన్ని వచ్చినా ప్రతికూలంగా వచ్చినవే ఎక్కువ. కాసేపటికి తేలిందేంటంటే అది ఫేక్ న్యూస్ అని. ఇక అది మొదలు.. అంతా నాలిక్కరుచుకోవడం మొదలెట్టారు.
ఐసీయూలో ప్రధాని తల్లి
ప్రధాని నరేంధ్రమోడీ తల్లి హీరాబా ఐసీయూ లో ఉందని ఆమె వీఐపీ ట్రీట్ మెంట్ కు నిరాకరించిందని, తనను చూడటానికి రావద్దని, దేశం గురించి పట్టించుకొమ్మని మోడీకి చెప్పిందని సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చిన వార్తలు అసత్యాలని ఏబీపీ న్యూస్ తెలిపింది. అసలు మోడీ తల్లి అని ప్రచారం అవుతున్న ఫోటోల్లో ఉన్నది ఆమె కాదని ఏబీపీ న్యూస్ స్పష్టం చేసింది. తాము కూడా ఆ తప్పుడు న్యూస్ ప్రచారం చేశామని అందుకు చింతిస్తున్నామని ఆ ఛానల్ ప్రకటించింది.
బ్నిట్నీని చంపేశారు…
హాలీవుడ్ పాపులర్ సింగర్ బ్రిట్నీ స్పియర్ చనిపోయిందన్న వార్త సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది. ప్రఖ్యాత మ్యూజిక్ సంస్థ సోనీ మ్యూజిక్ గ్లోబల్ తన అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ఈ వార్తను ప్రచురించింది. ఓ యాక్సిడెంట్‌లో బ్రిట్నీ చనిపోయిందని…మరిన్ని వివరాలు తెలిమజేస్తామని…RIP అంటూ ట్విట్ పోస్ట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు శోకసంద్రంలో కూరుకుపోయారు. కానీ తర్వాత ఆ వార్త ఫేక్ అని తేలడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. సోనీ మ్యూజిక్ గ్లోబల్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురికావటంతో ఇలా జరిగిందని తెలిసింది.
ఉత్తమ కరెన్సీగా రూ. 2000 నోటు…
నోట్ల రద్దు సంక్షోభంతో దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో చక్కర్లు కొట్టిన మరో ఫేక్ న్యూస్ రూ. 2000 నోటు. యూనెస్కో ఉత్తమ కరెన్సీగా రూ.2వేల నోటును ప్రకటించిందంటూ వాట్సాప్ లో వార్త చక్కర్లు కొట్టింది.
కొత్త నోట్లలో జీపీఎస్ చిప్..
నవంబర్ 8న పెద్దనోట్లను ప్రధాని మోదీ రద్దు చేసిన తర్వాత ఈ విషయంలో ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. కొత్త రెండువేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఉందని, ఎవరైనా పెద్దమొత్తంలో ఈ నోట్లను దాచిపెడితే.. సులువుగా దొరికిపోతారని, భూమిలో 120 మీటర్ల లోతులో నోట్లు దాచిపెట్టినా.. రాడర్ నిఘా నుంచి తప్పించుకోలేరంటూ ఈ వదంతి బాగా హల్ చల్ చేసింది. నోటులో అనేక భద్రతాపరమైన ఫీచర్లు ఉన్నాయి కానీ, ఎలాంటి చిప్ లేదని తేల్చేసింది.
కొత్త నోట్లలో రేడియోయాక్టివ్ ఇంక్
దేశంలో భారీగా కొత్త నోట్లు అక్రమార్కుల వద్ద దొరికిపోతుండటంతో తెరపైకి వచ్చిందీ ఈ వదంతి. ఆర్బీఐ రేడియోయాక్టివ్ ఇంక్ తో కొత్త రూ. 500, రెండువేల నోట్లను ముద్రించిందని, దీనితో ప్రజలకు ఎలాంటి హాని ఉండదని, కానీ ఎవరైనా వీటిని పెద్దమొత్తంలో దాచుకుంటే ఐటీ అధికారులు ఇట్టే పట్టేయగలరంటూ ఈ ఫేక్ న్యూస్ హల్ చల్ చేసింది. ఈ ఇంక్ వల్లే పెద్ద ఎత్తున అక్రమార్కులు దొరికిపోతున్నారంటూ ఊహాగానాలు జోడించింది.
కుక్క మాంసంతో బిర్యానీ….
డాగ్ మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారని ఫేక్ న్యూస్ అని తేలింది. ఈ విషయాన్ని వాట్సాప్‌లో పెట్టిన యువకుడిని పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రెస్టారెంట్ కు వెళ్తున్న స్నేహితులను భయపెట్టేందుకు ఎంబీఏ విద్యార్థి వలబోజు చంద్రమోహన్.. తల నరికిన కుక్కల ఫోటోలతో పాటు షా గౌస్ హోటల్ యజమానిని పోలీసులు అరెస్టు కూడా చేశారని ఫేక్ న్యూస్‌ను వారికి ఫార్వాడ్ చేశాడు. దీంతో షాక్‌కు గురైన చంద్రమోహన్ స్నేహితులు తమకు వచ్చిన వివరాలను వేరే వాట్సాప్ గ్రూప్‌లకు ఫార్వాడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాట్సాప్ గ్రూప్‌లను పరిశీలించుకుంటూ వెళ్లగా చంద్రమోహన్ ఫేక్ న్యూస్‌ను పంపినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, షా గౌస్ హోటల్ యజమానిని కుక్క మాంసం బిర్యానీ కేసులో పోలీసులు అరెస్టు చేశారనే వాట్సాప్ మెసేజ్‌ను అన్ని ప్రముఖ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఐష్ ఆత్మహత్య…. ఫేక్ న్యూస్ కలకలం
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ వదంతుల బాధితుల జాబితాలో చేరారు. ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారని ఆదివారం వార్తలు రావడంతో కలకలం రేగింది. కుటుంబ కలహాలతో ఐష్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచారని ప్రచారం జరిగింది.
‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాలో రణబీర్ కపూర్ సన్నిహితంగా నటించడంతో ఆమె కుటుంబంలో కలతలు రేగాయని కథ అల్లారు. ఐశ్వర్య ఆత్మహత్యాయత్నం చేయడంతో బచ్చన్ కుటుంబం డాక్టర్ ను పిలిపించిందని, అప్పటికే ఆమె చనిపోయిందని.. ఈ విషయాన్ని బయటకు రానీయలేదని ఈ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది. బ్లాగుల్లోనూ విపరీతంగా ట్రెండయింది.
ఉత్తమ జాతీయగీతంగా ‘జనగణమన’
ఈ ఫేక్ కథనం కూడా వాట్సాప్ యూజర్లు ప్రతి ఒక్కరికీ చేరి ఉంటుంది. ప్రపంచంలోనే ఉత్తమ జాతీయగీతంగా ‘జనగణమన’ను యూనెస్కో ప్రకటించిందంటూ ఈ కథనం 2008 నుంచి ఈమెయిళ్లలో చక్కర్లు కొడుతోంది. అప్పట్లోనే యూనెస్కో స్పందించింది. దేశంలోని పలు బ్లాగుల్లో ప్రచురించినట్టు భారత జాతీయగీతం గురించిగానీ, ఇతర దేశం గురించిగానీ తాము ఎలాంటి ప్రకటన చేయలేదని స్పష్టత ఇచ్చింది. అయినా ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ న్యూస్ విపరీతంగా చక్కర్లు కొట్టింది.
జయలలిత కూతురు….
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత ఆమెకు రహస్యంగా కూతురు ఉన్నారని, ఆమె అమెరికాలో నివసిస్తున్నారని ఓ మహిళ ఫొటోతో బూటకపు కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలు ఖండిస్తూ ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద వివరణ ఇచ్చింది. సదరు ఫొటోలో ఉన్న మహిళతో జయలలితకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ఆస్ట్రేలియాలో నివసిస్తున్నదని చిన్మయి తెలిపింది.దీంతో జయ కూతురు అన్న వార్తలకు బ్రేక్ పడింది.
ఉప్పు కొరత…
నోట్ల రద్దు తర్వాత ఉప్పు కొరత వదంతి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద దుమారమే రేపింది. దేశానికి 7,517 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నా ఉప్పు కొరత వస్తుందంటూ వార్తలు రాగా.. సామాన్యులు అది నమ్మి అర్ధరాత్రి దుకాణాలకు పోటెత్తారు. ఉప్పు ధర నాలుగు రెట్లు పెరిగిపోయింది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.
ఆరువేల కోట్లు సరెండర్……
నల్లధనంపై మెరుపుదాడి చేస్తూ ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేశారు. ఈ వార్త ఎంత సంచలనం సృష్టించిందో.. అదేవిధంగా సూరత్ వజ్రాల వ్యాపారి ఏకంగా రూ. ఆరువేల కోట్ల పెద్దనోట్లను కేంద్రానికి స్వాధీనం చేసినట్టు వచ్చిన వార్త కూడా అంతే సంచలనం సృష్టించింది. మోడీ సంచలన నిర్ణయం వల్లే ఒక్కసారిగా ఇది సాధ్యమైందని, ఇదేవిధంగా పెద్దమొత్తంలో నల్లధనం వెలుగులోకి రావడం ఖాయమంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. కానీ తర్వాత ఈ వార్త అవాస్తవమని తేలింది.