ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల ఆస్తి….

130

ప్రగతి భవన్ తెలంగాణ గౌరవమని, అది తెలంగాణ రాష్ర్ట ఆస్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రగతి భవన్‌లో 150 గదులున్నాయని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై సీఎం కాస్త ఉద్రేకానికి లోనైయ్యారు. ప్రగతి భవన్‌లో 150 గదులున్నాయా? చూపించండి అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల ఆస్తి తప్ప.. కేసీఆర్ ఇల్లు కాదని స్పష్టం చేశారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు ప్రగతి భవన్ కు వస్తుంటారు. వారికి తెలంగాణ గౌరవాన్ని తెలిపే విధంగా ప్రగతి భవన్ ఉంటుందన్నారు.

kcr

సీఎం నివాసం గురించి అల్పంగా మాట్లాడటం సరికాదన్నారు. సీఎం సభలో ఉన్నప్పుడు ఇంత అసంబద్ధంగా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. పేపర్‌లో వచ్చే వార్తలను ఆధారం చేసుకొని అసెంబ్లీలో మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ ధోరణి ఏంటో కోమటిరెడ్డి బయటపెట్టిండు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకుల పాలనలో ముఖ్యమంత్రికి అనువైన నివాసం లేకుండా పోయిందన్నారు. సీఎం కాన్వాయ్ రోడ్డు మీద ఉండే పరిస్థితి నెలకొని ఉందన్నారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రగతి భవన్ నిర్మించడం జరిగిందన్నారు.

PRAGATHI BHAVAN

త్వరలోనే జంటనగరాల్లోని శాసనసభ్యులు, ఎంపీలందరికి ప్రగతి భవన్ ను పరిచయం చేస్తానని సీఎం ఈ సందర్భంగా చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపికపై ప్రగతి భవన్ లో చర్చిద్దామని తెలిపారు. ప్రగతి భవన్ లో ఎన్ని గదులున్నాయో.. అప్పుడు మీకు చూపిస్తాను అని చెప్పారు. భవన్ ఎందుకు నిర్మించామో అప్పుడు చెబుతామన్నారు. ఆ రోజే ప్రగతి భవన్ లో మంచి విందు ఏర్పాటు చేస్తానని సీఎం పేర్కొన్నారు.