కాల్వల భూ సేకరణ పై ప్రత్యేక దృష్టి : హరీష్ రావు

326
harishrao
- Advertisement -

సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన, వీలుగా అవసరమైన భూమిని త్వరగా సేకరించి, ఆ భూమి సేకరణలో మరింత వేగం పెంచాలని ఆర్డీఓ, తహశీల్దార్లు, ఇరిగేషన్ ఇంజనీర్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి వరకూ జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ అనంత రెడ్డి, ఇరిగేషన్ ఏస్ఈ ఆనంద్, వివిధ మండలాల తహశీల్దార్లు, స్థానిక ప్రజా ప్రతినిధులతో 10వ, 11వ ప్యాకేజీ రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనుల పురోగతి పై మంత్రి సమీక్ష జరిపారు. ప్రధానంగా ఎడమ, కుడి కాలువలు, పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, మైనర్ కెనాల్స్ కోసం అవసరమైన భూ సేకరణ చేపట్టాల్సి ఉన్నందున స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సహకరించాలని, ఈ భూ సేకరణ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో వ్యవహరించి భూ సేకరణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ఎల్లాయపల్లి, విఠలాపూర్, మాచాపూర్, గంగాపూర్, చంద్లాపూర్, రామంచ, పుల్లూరు, చిన్నగుండవెళ్లి, బూర్గుపల్లి, ఇర్కోడ్, ఎన్సాన్ పల్లి, వెంకటాపూర్, బండారుపల్లి, ఎల్లారెడ్డి పేట, ఘనపూర్ తుక్కాపూర్ గ్రామాలలో కాల్వల నిర్మాణాలకు సంబంధించిన భూ సేకరణ తొందరగా పూర్తి చేయాలని, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపితే భూ సేకరణ సులువు అవుతుందని సూచించారు. ప్రజా ప్రతినిధులుగా.. ప్రజలకు గొప్ప సేవే చేసే అవకాశం వచ్చిందని భావించి, దీనిని ఓ అదృష్టంగా భావిస్తూ.. చరిత్రలో నిలిచిపోయేలా పనుల వేగవంతం చేసేందుకు ఎప్పటికప్పుడు అధికారులకు, ఇటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని కోరారు. మైనర్ ఇరిగేషన్ లో భాగంగా ప్రతి పల్లెలోని చెరువులు, కుంటలు, ఒర్రెలు, వాగులు, వంకలన్నీ నింపితే.. ఆ పల్లె ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేసినవారమవుతామని, ఈ విషయం పై ప్రజా ప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

నియోజకవర్గ పరిధిలోని అత్యవసర అభివృద్ధి నిర్మాణ పనులకు ఆటంకాలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు మంత్రి సూచించారు. కాగా సిద్ధిపేట పట్టణంలోని యూజీడీ పనులు, డబుల్ బెడ్ రూమ్స్, తాగునీటి సరఫరా ఇతరత్రా నిర్మాణ పనులకు కావాల్సిన 150 లారీల సిమెంటు లోడ్ల వరకు అవసరం ఉన్నట్లు మంత్రి దృష్టికి పబ్లిక్ అండ్ హెల్త్ ఈఈ వీర ప్రతాప్, పంచాయతీ రాజ్ ఈఈ కనక రత్నంలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు రవాణాకు సంబంధించి ప్రత్యేక పాసులు జారీ చేయాలని ఇందుకోసం జిల్లా కలెక్టర్, పోలీసు శాఖ అధికారుల సమన్వయంతో చూస్తారని, అవసరమైన మేర సిమెంట్ లోడ్ల లారీలను పంపాలని సంబంధిత సంస్థ యాజమాన్య ప్రతినిధులకు ఫోన్ లైన్లో మంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ డీఈ గోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -