కరోనాపై పోరులో ‘ఫార్మ్ డీ’ డాక్టర్ల సేవలు..

263
b vinod
- Advertisement -

కరోనా వైరస్ పై వైద్య పరంగా పోరాటం సాగించే యజ్ఞంలో స్వచ్చందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఫార్మా వైద్యుల అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఫార్మ్ డీ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాణోత్ చంద్రశేఖర్ నాయక్ నేతృత్వంలోని వైద్యులు రూపా, నరేశ్, రాంరెడ్డి లు మంగళవారం వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.

క్లినికల్‌గా, ఫార్మసిస్ట్ పరంగా కాకుండా వైద్య రంగంలో ఫార్మ్ డీ డాక్టర్ల పాత్ర క్రియాశీలకమని ఫార్మ్ డీ డాక్టర్లు వినోద్ కుమార్‌కు వివరించారు. ఫార్మ్ డీ (Pharm’ D) పట్టభద్రులను డాక్టర్లుగా గుర్తింపునిస్తూ పార్లమెంట్‌లో బిల్లును ఏడేళ్ళ క్రితం ఆమోదించారని వారు తెలిపారు.

ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఫార్మ్ డీ డాక్టర్ల సేవలను ఉపయోగించుకుని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ బారిన పడిన వారిని డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది ఇప్పటికే రాత్రింబవళ్ళు సేవలు అందిస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఈ బృహత్తర యజ్ఞంలో స్వచ్చందంగా సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన ఫార్మా డాక్టర్లను కూడా భాగస్వామ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వినోద్ కుమార్ అన్నారు. కఠిన స్వీయ నియంత్రణ తోపాటు సోషల్ డిస్టెన్స్ ను పాటించడం ద్వారా కరోనాపై సంపూర్ణ విజయం సాధించ వచ్చని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాణోత్ చంద్రశేఖర్ నాయక్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ బాధితులకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,900 మంది ఫార్మా విద్యార్థులు, 5,700 ఫార్మా పట్టభద్రులు ప్రభుత్వం వద్ద ఎన్ రోల్ అయి ఉన్నారని తెలిపారు.

ఈ మేరకు సంబంధిత ఉన్నతాధికారులకు తగిన ఆదేశాలు జారీచేసి కరోనా వైరస్ బాధితులకు స్వచ్చందంగా సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కు రాసిన లేఖలను ఫార్మా డాక్టర్లు వినోద్ కుమార్ కు అందజేశారు. డాక్టర్స్ పేర్లు, చిరునామా, మొబైల్ నంబర్ సహా పూర్తి వివరాలు ఆ జాబితాలో వారు పొందు పర్చారు.

- Advertisement -