విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మిస్తున్నారు. విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు – రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లెయితే నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీత దర్శకుడు. ఈ మూవీ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ షెరటాన్ హోటల్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ, “ఈ సినిమా టీజర్ రిలీజయ్యాక చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. విజయ్ డబుల్ రోల్ చేస్తున్నాడా, ట్రిపుల్ రోల్ చేస్తున్నాడా అని డౌట్ పడ్డారు. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఇందులోని యామిని పాత్ర బెస్ట్ అని చెప్పగలను. యామిని క్యారెక్ట చెయ్యడం నాకొక ఎమోషనల్ జర్నీ. సినిమా చూశాక కచ్చితంగా ప్రేక్షకుల అభిప్రాయం మారుతుంది. నా ఫ్యాన్స్ హ్యాపీగా, బహుశా గర్వంగా ఫీలవుతారు, ఇలాంటి పాత్ర చేసినందుకు. నన్ను నమ్మండి. అందరూ సినిమా చూసి ఆశ్చర్యపోతారు.
ఇప్పటివరకూ నేను పనిచేసిన డైరెక్టర్లలో క్రాంతి మోస్ట్ సెన్సిబుల్ అండ్ మోస్ట్ ఎమోషనల్ డైరెక్టర్. స్టోరీయే ఈ సినిమాకి హీరో. ఇంతదాకా ఇలాంటి స్క్రీన్ ప్లేను నేను చూడలేదు. కొత్తదనం కావాలని కోరుకునే ప్రేక్షకులకు ఇది ట్రీట్ లా ఉంటుంది. విజయ్ దేవరకొండ ఫెంటాస్టిగ్గా నటించాడు. నటుడిగా అతడిని ఈ సినిమా ఇంకో స్థాయిలో నిలబెడుతుంది. కె.ఎస్. రామారావు నాకు ఈ సినిమాకే కాకుండా, నా లైఫ్‌లో ఒక తండ్రిలా కనిపించారు” అని చెప్పారు.