ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభంకానున్నది. నాగోబా జాతర ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. సర్పజాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్యరోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేషనారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనుల నమ్మకం. అమావాస్య నాడు సరిగ్గా సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్య కాలంలో గిరిజన పూజారులకు తమ ఆరాధ్య దైవం ఆదిశేషువు కనిపిస్తాడనీ, వారందించే పాలు తాగి ఆశీర్వదించి అదృశ్యమవుతాడని గిరిజనులు విశ్వసిస్తారు. ఆదిమ గిరిజనుల్లో మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా గోండుల దేవత.
నాగోబా దేవాలయం ఆదిలాబాద్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కెస్లాపూర్ గ్రామంలో ఉంది. కెస్లాపూర్‌లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. కెస్లాపూర్ జనాభా 400కు మించదు. కాని పండగనాడు లక్షలాది మందితో అది జనారణ్యంగా మారుతుంది. జనవరి 25 నుంచి 29 వరకు నాలుగు రోజులపాటు గిరిజనులు ఈ పండుగ జరుపుకుంటారు. ఏటా పుష్యమాసము అమావాస్య రోజున జాతర ప్రారంభ మవుతుంది. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటు మాయమ వుతాయని గిరిజనుల నమ్మకం.
ఇక ఈ జాతర కోసం మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని కాలినడకన నాలుగు రోజుల కిందట కెస్లాపూర్‌కు చేరుకున్నారు. నాగోబా ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్ల కింద వారు సేదతీరారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్ ఈనెల 27న జరుగనుండగా.. మంత్రులు, కలెక్టర్, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత.