ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కు అనుకోని..సంఘటన చోటుచేసుకుంది. ఐశ్వర్యను ఆశ్చర్య పరచడంతో పాటు..అమ్మడు చేత కంటతడి కూడా పెట్టించింది. ఐశ్ ను అంతాల ప్రభావితం చేసిన విషయం ఏంటీ అనుకుంటున్నారా..ఐతే మీరే చూడండి. ఏదైనా విద్యలో శిక్షణ ఇచ్చిన గురువుకి గురుదక్షిణ సమర్పించటం లోక సహజం. కానీ ఆ గురువే శిష్యురాలికి గురుదక్షిణ సమర్పిస్తే అది వింతే అవుతుంది. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ విషయంలో ఇదే జరిగింది. ఇండియాలో తొలిసారి వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతోంది. అందులో ప్రపంచ ప్రఖ్యాత డ్యాన్సర్లు సందీప్ సోపార్కర్, అలేషియా రౌత్, అష్లీలోబో పాల్గొంటున్నారు. ముంబైలోని నవధార ఇండియా డ్యాన్స్ థియేటర్లో జరుగుతున్న ఈ ఫెస్టివల్ ప్రారంభ ప్రదర్శనకు ఐశ్వర్యరాయ్ హాజరైంది. అందులో ఐశ్వర్య ప్రాధమిక పాఠశాలలో చదువుకున్నపుడు ఆమెకు నాట్యంలో తర్ఫీదు ఇచ్చిన డ్యాన్స్ టీచర్ లతా సురేంద్ర కూడా పాల్గొంది.
డ్యాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన ఐశ్వర్యరాయ్ గురువు లతా సురేంద్ర…ఆ ప్రదర్శనను ఐశ్ కు అంకింతమిచ్చి అమ్మడును ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఐశ్వర్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఐశ్వర్య లతా సురేంద్రకు ధన్యవాదాలు తెలుపుతూ ‘నేను లతా గారి శిక్షణలో రెండవ తరగతి నుంచి ఏడవ తరగతి దాకా డ్యాన్స్ నేర్చుకున్నాను. ఆమెతో కలిసి నాట్యప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు నా గురువుగారు ప్రదర్శన ఇస్తుంటే పులకించిపోయాను. ఆమె ప్రదర్శన నాకు అంకితమివ్వడంతో ఉక్కిరిబిక్కిరై నా కళ్లు చెమర్చాయి.
ఇది ఒక అపూర్వ సంఘటన’ అంటూ సంతోషాన్ని వ్యక్తపరచింది. లతా సురేంద్ర ప్రతిస్పందిస్తూ ఐశ్వర్య తనకు అత్యుత్తమ విద్యార్థినిగా ఉండేదని, ఆమెకు నాట్యం నేర్పడం తన అదృష్టమని చెప్పింది. అంతేకాదు, అవకాశం వస్తే ఐశ్వర్య కూతురు ఆరాధ్యకు కూడా నాట్యం నేర్పు తానని ఆమె తెలిపింది. గురుశిష్యుల అనుబంధానికి ఇదొక నిదర్శనమే.