గజ్వేల్‌లో టీడీపీ జీరో…

80
Less Response for TDP Membership Drive in Telangana

తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే టీడీపీలో ఉన్న మెజారిటీ ఎమ్మెల్యేలు, నేతలు కారెక్కయడంతో సైకిల్ పంచరైపోయింది. ఓ దశలో ఎన్టీఆర్‌ భవన్‌కు టు లెట్ బోర్డు పెడతారన్న వార్తలు సైతం వెలువడ్డాయి. ఈ దశలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న తెలుగు తమ్ముళ్లకు నిరాశే మిగిలింది.

కారు వేగంతో సైకిల్ పోటీ పడలేకపోయిందని తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. గతంలో ఉన్న సభ్యత్వాల కంటే ఈ దఫా సగం తక్కువగా నమోదు కావటం విశేషం. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ సభ్యత్వాల సంఖ్య 7.94 లక్షల నుంచి 3.7 లక్షలకు పడిపోయింది. సభ్యత్వ నమోదు గడువు డిసెంబర్ మొదటి వారంతోనే ముగిసినప్పటికి…మరికొన్ని రోజులు గడువు పొడగించిన ప్రయోజనం లేకపోయింది.

ఇక సీఎం కేసీఆర్‌ ఇలాఖాలో టీడీపీకి పట్టుంది అన్న వార్తలకు సభ్యత్వ నమోదుతో చెక్ పడినట్లైంది. గతంలో జరిగిన మున్సిపాలిటీ,జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ తన హవా కొనసాగించగా..తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలతో నేతలతో సహా క్యాడర్ అంతా కారెక్కేశారు. దీంతో సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గ‌జ్వేల్ లాంటి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ప్రాణం పోకుండా కాపాడుతున్న రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాపరెడ్డి సైతం డీలా పడిపోయారు. ఈ ప్రభావం స్పష్టంగా టీడీపీ సభ్యత్వ నమోదులో కనబడింది.గతంలో గజ్వేల్‌లో 18 వేల మంది టీడీపీ సభ్యత్వం తీసుకోగా…ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గవ్యాప్తంగా కేవలం రెండంటే రెండు స‌భ్య‌త్వాలు మాత్ర‌మే న‌మోద‌య్యాయి.

ఇక సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో సైతం సభ్యత్వ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. మెజారిటీ జిల్లాల్లో సైతం టీడీపీ సభ్యత్వం తీసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదట. దీంతో తెలంగాణలో టీడీపీకి రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితులు తప్పవేమోనని నేతలు భావిస్తున్నారట.