తెలంగాణ విత్తన భాండాగారం అయిందని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ ఫ్యాప్సీలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన మహిళా సాహితీవేత్తలకు విత్తన అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన 10 వేల ఏళ్ల క్రితమే వ్యవసాయం మొదలయిందన్నారు.
నాగలి (హలం) నుండి వ్యవసాయ నాగరికత పుట్టుకొచ్చిందని.. అటువంటి నాగలికి పుట్టినిల్లు అలంపురం అన్నారు. ఆ హలంపురం నేడు అలంపురంగా బాసిల్లుతుందని.. వ్యవసాయం దండగ అంటే మానవజాతి మనుగడే దండగ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో వ్యవసాయం పండగ చేసే పనిలో ఉన్నామని.. జనబాహుళ్యం అంతా ఎవరికి వారు తమ పనిలో, వృత్తులలో నిమగ్నమవ్వాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అన్నారు.
తెలంగాణ విత్తనానికి ప్రత్యేకత ఉందని… అది ఈ ప్రాంతం, ఈ నేలలకే సొంతం అన్నారు. మన దగ్గర తయారయిన విత్తనం ప్రపంచంలో ఎక్కడయినా మొలకెత్తుతుందని..అందుకే తెలంగాణ విత్తన భాండాగారం అయిందన్నారు. దాదాపు 400 కంపెనీలు 5 వేల కోట్ల విత్తన వ్యాపారం చేస్తున్నాయని.. విత్తన సదస్సుతో అన్నివిధాలా ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం దాదాపు 65,70 వేల కోట్లు వ్యవసాయంపై ఖర్చు చేస్తుందని.. నాలుగుకోట్ల తెలంగాణ రాష్ట్రం ఇంత ఖర్చు చేస్తుంటే .. 18 కోట్ల జనాభా ఉన్న యూపీ రాష్ట్రంలో కనీసం పదివేల కోట్లు కూడా ఖర్చుచేయడం లేదన్నారు. ఎన్నో సభలలో పాల్గొన్నాను కానీ ఇది శిఖరాగ్ర సభగా అనిపిస్తుందన్నారు. దేశమంతా అవసరం లేని అంశాల మీద చర్చ జరుగుతోంది.. తెలంగాణలో దానికి భిన్నంగా సమాజానికి ఉపయోగపడే, భవిష్యత్ కు బాటలు వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్దసారధి , విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ కేశవులు , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు హాజరయ్యారు.