హైదరాబాద్ : స్త్రీనిధి సర్వసభ్య సమావేశం రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, నాబార్డు ప్రతినిధి మోహనయ్య, స్త్రీనిధి అధ్యక్షురాలు, డైరెక్టర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ‘మా స్త్రీనిధి’ యాప్ ను ఆవిష్కరించారు. స్త్రీనిధి నుంచి మండల, గ్రామ సమాఖ్యలకు రూ.15.25 కోట్లను విడుదల చేసే చెక్కును… ప్రభుత్వానికి డివిడెండ్ గా రూ.5.52 కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేశారు. స్త్రీనిధి వార్షిక నివేదికను, ‘మా స్త్రీనిధి’ యాప్ సేవలను వివరించే బ్రోచర్ ను ఆవిష్కరించారు.
స్త్రీనిధి, సెర్ప్, మెప్మా సమష్టిగా పని చేస్తేనే మహిళల ఆర్థిక సాధికారత సాకారమవుతుందని చెప్పారు ఎర్రబెల్లి. పల్లె ప్రగతి అమలులో మహిళలు కీలకపాత్ర పోషించాలని…. ఇంటిని తీర్చిదిద్దే మహిళలు గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా మార్చే పల్లె ప్రగతిలో ముందుండాలన్నారు. రుణాలు తీడుకోవడంతోనే ఆగిపోకుండా… స్వంతంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు.
కల్తీ లేని వ్యవసాయ ఉత్పత్తులను… ప్లాస్టిక్ రహిత అనుబంధ ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలన్నారు. స్త్రీనిధి రుణాల చెల్లింపులు 100 శాతం ఉండేలా… ఆర్థిక క్రమశిక్షణతో పాటించేలా మాహిళలు ఉండాలన్నారు. మహిళా సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసిఆర్ పట్టుదలతో కృషి చేస్తున్నారని… వడ్డీలేని రుణాల కోసం రూ.2,196 కోట్లు చెల్లించారని చెప్పారు. స్త్రీనిధి విజయం రాష్ట్రంలో మహిళల సంఘటిత శక్తికి నిదర్శనం అన్నారు.