తెలంగాణలో కొత్తగా మరో ఆరు ఎయిర్ పోర్టులు రాబోతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల ఎయిర్‌పోర్టులు ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 6 ప్రతిపాదిత విమానాశ్రయాలపై ఏరియల్ సర్వే నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది.
సాంకేతిక బృందాల ద్వారా ఈ సర్వేను నిర్వహించనుంది ఏఏఐ. ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తారు. రిమోట్ సెన్సింగ్ జీఐఎస్ మ్యాపింగ్, నియంత్రణ వంటి సమాచారాన్ని సేకరిస్తారు. నేల స్వభావాన్ని కూడా అంచనా వేస్తారు. రన్‌వేలు, ఏటీసీకి అనుకూలతలు, ప్రతిపాదిత విమానాశ్రయ స్థలానికి చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో కొత్తగా ఎయిర్‌పోర్టులు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లా మామునూరు,పెద్దపల్లి జిల్లాలో బసంత్ నగర్,నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని అద్దకల్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా భూసేకరణ కూడా చేశారు.
రైట్ అనే సంస్థ ద్వారా సర్వే జరిపి నివేదికలను ప్రభుత్వం అందించగా, ప్రతిపాదనలను ఏఏఐకి పంపగా ఇప్పుడు ఏరియల్ సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏఏఐ.