గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని స్మోక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడం, ఇటీవల దివంగతులైన కె.ఆర్.ఆమోస్, అరుణ్‌జెట్లిలకు సంతాపం, నగరంలో శానిటేషన్ కార్యక్రమాలు మరింత సమర్థవంతగా చేపట్టేందుకు 40 ఆధునిక స్వీపింగ్ మిషన్ల కొనుగోలు, సిటీలోని 27 ప్రముఖ పర్యాటక స్థలాలు, దర్శనీయ, చారిత్రక ప్రదేశాల్లో 24/7 గంటలు శానిటేషన్ చేపట్టడం తదితర అంశాలపై శనివారం నగర మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు. జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, ఉన్నతాధికారులు, ఎం.పి రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ అమీన్ ఉల్ జాఫ్రీ, ఎం.ఎస్ ప్రభాకర్‌రావు, రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ నగరాలను స్మోక్ ఫ్రీ నగరాలుగా ప్రకటించే కార్యక్రమం ప్రారంభమైందని, ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగరాన్ని దేశంలోని మొట్టమొదటి స్మోక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరం కృషిచేద్దామనే తీర్మానాన్ని ఆమోదించాలని కోరగా సభ్యులందరూ అంగీకరించారు. దీంతో పాటు అన్ని ప్రధాన రహదారుల్లో స్వీపింగ్ నిర్వహించడానికి 40 ఆధునిక స్వీపింగ్ మిషన్లను కొనుగోలు చేయనున్నట్టు, ఇందుకుగాను గ్లోబల్ టెండర్లను త్వరలోనే పిలువనున్నట్టు మేయర్ తెలిపారు. నగరంలోని అత్యంత ప్రాముఖ్యత ఉన్న హెరిటేజ్, పర్యాటక, ఆద్యాత్మిక ప్రాంతాలైన 27 స్థలాల్లో 24/7 శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
జిహెచ్ఎంసిలో వృద్దులు, అనారోగ్యం, ఇతర కారణాల వల్ల విధులు నిర్వర్తించలేని శానిటేషన్ సిబ్బంది స్థానంలో వారి వారసులను నియమించే ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. నగరంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను వేసే వాహనాలకు మొదటిసారి 25వేల రూపాయలు, రెండో సారి 50వేల రూపాయలు జరిమానావేసి మూడోసారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు నిబంధనలకు విరుద్దంగా భవన నిర్మాణ వ్యర్థాలను వేసేవారికి రూ. 92.50లక్షలను జరిమానాలు విధించినట్టు పేర్కొన్నారు. మరోవారం రోజులలోపు జీడిమెట్లలోని భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. నగరంలో వీధిదీపాల నిర్వహణపై ఏజెన్సీ ఇ.ఇ.ఎస్.ఎల్‌తో విద్యుత్ విభాగం అధికారులతో సమీక్ష జరిపి నగరంలో అన్ని వీధిదీపాలు వెలిగే విధంగా చర్యలు చేపట్టాలని కమిషనర్ ను కోరారు.
కొన్ని సర్కిళ్లకు చెందిన డిప్యూటి కమిషనర్లు, ఇతర అధికారులు కార్పొరేటర్లకు తగు గౌరవం ఇవ్వడంలేదని, అభివృద్ది కార్యక్రమాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు కార్పొరేటర్లు సభలో లేవనెత్తారు. దీంతో సర్కిల్, జోనల్ స్థాయిలో అధికారులు, కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని కమిషనర్‌ను మేయర్ రామ్మోహన్ కోరారు. జిహెచ్ఎంసి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేనందున ఆర్టీసీకి నిధుల బదిలీ చేయలేమని జిహెచ్ఎంసి జనరల్ బాడిలో తీర్మానంచేసి ప్రభుత్వానికి గతంలోనే పంపామని మేయర్ రామ్మోహన్ సభకు తెలిపారు. ఆర్టీసికి జిహెచ్ఎంసి ద్వారా రూ. 336.40కోట్లను గతంలోనే అందించామని వివరించారు. నగరంలో దాదాపు 1900 మంది శానిటేషన్ కార్మికుల ఖాళీలు ఉన్నాయని, వీరిలో కొందరు వృద్దాప్యం, గైర్హజరు, అస్వస్తతో విధులకు రాకుండా ఉంటున్నారని కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.
జిహెచ్ఎంసిలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నియామకానికిగాను చర్యలు చేపట్టాల్సిందిగా టి.పి.పి.ఎస్.సి కి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. నగరంలో శానిటేషన్ నిర్వహణకుగాను ఇటీవల 120 మినీ టిప్పర్లు, 60 బాబ్‌కాట్‌లను ప్రత్యేకంగా కేటాయించామని, వీటితో ప్రస్తుతం గార్బేజ్ తరలింపుకు 263 మినీ టిప్పర్లు, 66 బాబ్‌కాట్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ వాహనాలన్నింటికి జి.పి.ఎస్ విధానాన్ని దశలవారిగా అమర్చనున్నట్టు వివరించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నగరంలోని పలు అభివృద్ది కార్యక్రమాల పై విస్తృతంగా చర్చ నిర్వహించారు.