హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా అదరగొడుతూ.. విజయవంతంగా సాగుతున్న బిగ్ బాస్ సీసన్ 3 నిన్నటితో 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్‌లో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యులు నామినేట్ అవ్వడంతో ప్రేక్షకులతో పాటు, ఇటు ఇంటి సభ్యులలో ఉత్కంఠ ఎక్కువైంది. ఇంకొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు 3 టైటిల్ విన్నర్ తేలనున్న తరుణంలో ఇప్పుడు ఎవరు ఇంటి నుండి వెళ్లిపోనున్నారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
గతవారం ఇంటి నుండి వితికా బయటకి వెళ్లగా, ఈ వారం మరొకరు బిగ్ బాస్ హౌజ్‌ని వీడనున్నారు. చివరి వారం హౌజ్‌లో ఐదుగురు సభ్యులు ఉండనున్నారు. అందులో ఒకరు బిగ్ బాస్ టైటిల్ అందుకుంటారు. అయితే ఈవారం నామినేషన్ ప్రక్రియ భిన్నమైనది, ప్రత్యేకమైనది అని బిగ్ బాస్ తెలిపారు. ఈ ప్రక్రియలో పాల్గొనే ఇంటి సభ్యుల్లో ఒక్కరు మాత్రమే గెలుస్తారు. గెలిచిన కంటెస్టెంట్ ‘టికెట్ టు ఫినాలే’ సొంతం చేసుకుంటారు. ఓడిపోయిన మిగతా సభ్యులు నామినేట్ అవుతారు.
ఈ వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులందరూ బోర్డుపై ఉన్న వివిధ కలర్ బ్లాక్స్‌లో నుంచి వారికి నచ్చిన బ్లాక్ తీసుకొని దాని మీద ఏముందో చెప్పాలని బిగ్ బాస్ సూచించారు. ముందుగా శివజ్యోతి బోర్డ్‌పై ఉన్న బ్లాక్‌ని తీసుకోగా ఆమెకి 60 శాతం బ్లాక్ లభించింది. ఇక ఆ తరువాత వరుణ్ తీసిన బ్లాక్‌పై 40% అని, శ్రీముఖి తీసిన బ్లాక్‌పై 50% అని, అలీ తీసిన బ్లాక్‌పై 70% అని, బాబా భాస్కర్ బ్లాక్‌పై 40%, రాహుల్ బ్లాక్‌పై 50% అని రాసుంది. ఈ శాతాలే టాస్క్‌కు మూలాధారం కాగా, బ్యాటరీ ఉంటే నిండుగా.. జరుపుకోండి పండుగ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఇది ఈ వారం టాస్క్ పేరు. ముందు ఇంటి సభ్యులు ఎంపిక చేసుకున్న బ్లాకులపై ఉన్న నంబర్ వారి బ్యాటరీ పవర్ పర్సెంటేజ్. ఈ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సంబంధించిన బ్యాటరీ మానిటర్స్‌ను గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఎవరి మానిటర్‌పై వారి బ్యాటరీ పర్సెంటేజ్ వద్ద లైట్లు వెలిగాయి. ఈ బ్యాటరీ పర్సెంటేజ్‌ను పెంచుకోవడమే వారికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. అయితే, ఈ టాస్క్ అంత ఈజీగా లేదు.
ఫస్ట్ బజర్ మోగిన వెంటనే అలీ, శివజ్యోతి బెల్స్‌ను ముందుగా మోగించారు. వీరికి బిగ్ బాస్ అరటిపండ్ల టాస్క్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కో అరటిపండ్ల గెల ఇచ్చి నిర్దిష్ట సమయంలో ఎవరు ఎక్కువ అరటిపండ్లు తింటే వారు విజేత అని తేల్చారు. ఈ టాస్క్‌లో అలీ 21 అరటిపండ్లు తిన్నాడు. శివజ్యోతి 15 అరటిపండ్లు తినగలిగింది. ఈ టాస్క్‌లో గెలిచి తన బ్యాటరీని 10 శాతం పెంచుకున్నాడు అలీ.
ఇక ఆ తర్వాత బాబా భాస్కర్- శ్రీముఖి మధ్య టాస్క్ నడించింది. ఈ టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక పిండి తొట్టె, ఒక ఈకల తొట్టె ఉంచారు. పిండి, ఈకల మధ్య ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మొదట పిండి తొట్టెలోని పది ఆల్ఫాబెట్స్‌ను శ్రీముఖి, బాబా భాస్కర్ నోటితో ఒక్కొక్కటిగా తీసి పక్కనే ఉన్న బౌల్‌లో వేయాలి. అలాగే, ఈకల తొట్టెలోవి కూడా తీయాలి. ఇలా తీసిన ఆల్ఫాబెట్స్ మ్యాచ్ అవ్వాలి అని బిగ్ బాస్ ఆదేశించారు. అయితే ఇద్దరు సేమ్ ఆల్ఫాబెట్స్ మ్యాచ్ చేయగా, ముందుగా నోటితో ఆల్ఫాబెట్స్‌ను బయటికి తీసిన బాబా భాస్కర్ ఈ టాస్క్‌లో గెలిచారు.
ఇక నాలుగో బజర్ మోగగానే ఇంటి సభ్యులు అందరు బెల్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో బిగ్ బాస్ బజర్ మోగించగా, నిద్రనుండి లేచి వచ్చిన బాబా, అలీలు బెల్స్ మోగించారు. దీంతో వీరిద్దరు టాస్క్ లో పాల్గొన్నారు . ఆ టాస్క్ ఏంటంటే ఇద్దరికి కలిపి ఓ మట్టీ టబ్ ఇచ్చిన బిగ్ బాస్ అందులో వారికి ఇచ్చిన పూలని అందులో నిలబెట్టాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఒకరి పూలని మరొకరు తీసే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఎండ్ బెల్ మోగిన సమయానికి ఎవరి పూలు ఎక్కువగా ఉంటాయో వారు గెలిచినట్టు. తమ బ్యాటరీ రీఫిల్ చేసుకునే అవకాశాన్ని పొందుతారు. టాస్క్‌లో ఇద్దరు హోరా హోరీగా ఆడారు. పెట్టిన పూలని ఇద్దరు తీసి దూరంగా గిరాటేశారు. ఆసక్తికరంగా సాగుతున్న ఈ గేమ్‌లో విజేత ఎవరనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది.