త్వరలో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ మంచి ప్రదర్శనలు చేస్తోందని…విరాట్ ఓ ఛాంపియన్ అన్నారు. అయితే, కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లలో చివరి దశలో ఓటమి చవిచూస్తున్నారని దీనిని అధిగమించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.
ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నారని..జట్టు కూడా పటిష్టంగా ఉందని కానీ ఐసీసీ టోర్నమెంట్లలో ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్స్‌లో బోల్తా పడుతున్నారు. దీనిని అధిగమించాలన్నారు.
2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాకౌట్‌లోనే వెనుదిరగగా మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. ఇక 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫి గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేదు. ఈ నేపథ్యంలో గంగూలీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.