తెలుగింటి లోగిళ్లలో మాస్ .. క్లాస్.. పిల్లా.. పీచూ.. ముసలి.. ముతక.. అనే తేడా లేకుండా సాయంత్రాలు టీవీలకు అతుక్కుని ఆరాధనగా చూస్తున్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతిని తనివి తీరా ఆస్వాధించడంలో మనోళ్లు ఘనాపాటీలు అని ప్రూవ్ అవుతోంది. ఇప్పటికే వరుసగా చాలా ఎపిసోడ్స్ దాటుకుని తొమ్మిదో వారం విజయవంతంగా రన్ అవుతున్న ఈ కార్యక్రమంలో తదుపరి ఎలిమినేషన్ కి వేళయ్యింది. ఆదివారం రాత్రి 9గంటల ఎపిసోడ్ తో ఆ సంగతేదో తేలిపోనుంది.
ఈ వారం రాహుల్, హిమజ, మహేష్ విట్టా ఎలిమినేషన్స్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటిలానే ఈ వారం కూడా ఇద్దరు సేఫ్ అయ్యి.. ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వడంతోనే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఎవరా ఇద్దరూ అని అనుకునేలోపే నాగ్ ఇంకో షాక్ ఇచ్చాడు.
నాగార్జున తన చేతిలో ఉన్న ఎన్వలప్‌కవర్ తీసి ఈ వారం రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేషన్ అయ్యాడంటూ ప్రకటించగా.. హౌస్ అంతా నిశ్శబ్దం అయింది. దాంతో పునర్నవి తెగ బాధపడింది. ఇకపై నేను ఎవరితో గొడవపడాలి… ఎవరిని తిట్టాలి అంటూ కన్నీరు పెట్టుకుంది. ఇక మిగిలిన కంటెస్టెంట్లు బాధలో ఉండగా.. రాహుల్ మాత్రం జాలీగానే కనిపించాడు. అదే జోష్‌తో స్టేజ్‌పైకి వచ్చి.. ఇంటి సభ్యులకు పలు సూచనలు చేస్తూ కొద్దిసేపు ప్రేక్షకులను అలరించాడు. అంతేకాకుండా నాగార్జునతో రాహుల్‌తో ఓ గేమ్ ఆడించాడు. ఇంట్లో ఉన్న సభ్యులలో రిలేషన్ షిప్, హ్యూమానిటీ, ఫ్రెండ్షిప్‌కి గాను మార్క్స్ ఇచ్చాడు. వరుణ్‌కి 30కి 30 మార్కులు వేశాడు.
ఇక గేమ్ అయిపోయిన తర్వాత రాహుల్‌కి నాగ్ పెద్ద షాక్ ఇచ్చాడు. ఇది ఫేక్ ఎలిమినేషన్. నువ్వు ఏ దారిన వచ్చావో అదే ద్వారం నుండి ఇంట్లోకి వెళ్లొచ్చు. మిగతావన్నీ బిగ్ బాస్ చూసుకుంటాడని చెప్పేసరికి ప్రేక్షకులు నోరెళ్లపెట్టారు. బిగ్ బాస్ ఇచ్చిన ఈ ఊహించని ట్విస్ట్ అభిమానులను రక్తి కట్టించిందనే చెప్పాలి. మరోవైపు ఈ రోజు హౌస్ నుంచి హిమజ బయటికి వచ్చేస్తుందని ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా తెలియాలంటే కొద్దిగంటలు ఆగాల్సిందే మరి.